ఏఐసీసీ ఓబీసీ ఛైర్మన్ కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ హాజరు
ఈనెల 30న పీసీసీ నూతన కార్యవర్గ భేటీ
ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు
విజయవాడ : కుల గణనతో అన్ని వర్గాలకూ లబ్ధి చేకూరుతుందని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కులగణనతోనే వెనుకబడిన వర్గాల వారికి సాధికారత లభిస్తుందని చెప్పిన ఆయన కుల గణనతో ఓబీసీలకు లభించే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 29న ఆదివారం గుంటూరులో ఓబీసీలతో భారీ సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆలిండియా కాంగ్రెస్ కమిటీ, ఓబీసీ డిపార్ట్ మెంట్ ఛైర్మన్, మాజీ మంత్రి కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ తో పాటు సీడ్ల్యుసీ సభ్యులు, మాజీ మంత్రి డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరయ్యే ఈ సమావేశంలో బీసీ సాధికారత, కులగణన తరువాత వారికి లభించే మరింత మెరుగైన సంక్షేమం వంటి అంశాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. వెనుకబడిన వర్గాల కుల గణనకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్ధతు తెలిపిందన్నారు. సంఖ్యాపరంగా ఎవరు ఎంతమంది ఉన్నారో తెలిస్తేనే సంక్షేమ పథకాలు అందరికీ సమానంగా అందుతాయని ఆయన పేర్కొన్నారు. అందుకే సీడబ్ల్యుసీ సమావేశంలో కులపరమైన జన గణనకు కాంగ్రెస్ పార్టీ మద్ధతు తెలిపిందని చెప్పారు.
నవంబర్ 9, 10, 11 తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నాలలో ఓబీసీ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు వెల్లడించారు. సీడ్ల్యుసీ సభ్యులతో పాటు పీసీసీలోని ముఖ్య నాయకులు అందరూ ఈ సమావేశాల్లో పాల్గొని కుల గణన ప్రాముఖ్యాన్ని రాష్ట్ర ప్రజలకు వివరిస్తారని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో బీసీ జనాభా ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఈ సమావేశాలను అత్యంత ప్రతిష్టాత్మంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గం ఏర్పడిన నేపధ్యంలో అక్టోబర్ 30వ తేదీన విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో నూతన కార్యవర్గం భేటీ అవుతుందని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో పాటు జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొనే ఈ సమావేశానికి ఏఐసీసీ ఆంధ్రప్రదేశ్ బాధ్యులు క్రిష్టోఫర్ తిలక్, మయప్పన్ లు హాజరవుతారని ఆయన వెల్లడించారు. అదే విధంగా రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు, పార్టీ విధానపరమైన నిర్ణయాలతో పాటు భవిష్యత్ కార్యచరణపై చర్చిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజల తరుపున పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీకి మీడియా కూడా సహకరించాలని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఈ సందర్భంగా విజ్నప్తి చేశారు.