సైకో జగన్‌ను వదిలిపెట్టం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
చంద్రబాబును కలిసిన నారా భువనేశ్వరి, లోకేశ్, కాసాని జ్ఞానేశ్వర్
రాజమహేంద్రవరం : స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కుటుంబసభ్యులు కలిశారు. శనివారం ఉదయం ములాఖత్‌లో చంద్రబాబును కుమారుడు నారా లోకేశ్, సతీమణి నారా భువనేశ్వరి కలిశారు. వీరితో పాటు తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు.
టీడీపీ అధినేత చంద్రబాబును జైలులో బంధించి నేటికి 50 రోజులైందని, ఏ తప్పూ చేయకపోయినా వ్యక్తిగత కక్షతోనే ఆయనను అరెస్టు చేశారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రజల మధ్యకు చంద్రబాబును రానీయకుండా చేస్తున్నారన్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండులో ఉన్న చంద్రబాబుతో భువనేశ్వరి, లోకేశ్ శనివారం ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు వెలుపల మీడియాతో లోకేశ్ మాట్లాడారు. రాష్ట్రంలో వ్యక్తిగత కక్ష సాధింపులు ప్రత్యక్షంగా చూస్తున్నాం. రాజకీయ ప్రత్యర్థులు ఓడిపోయేందుకు కష్టపడటం సహజమే. చంద్రబాబు చనిపోవాలి.. చంద్రబాబును చంపేస్తామని వైసీపీ నేతలు బాహాటంగా చెబుతున్నారు. కేసుతో సంబంధం లేని నా తల్లిని కూడా జైలుకు పంపిస్తామని వైసీపీకి చెందిన మహిళా మంత్రి వ్యాఖ్యానించారు. ‘నిజం గెలవాలి’ పేరుతో ప్రజల్లోకి నా తల్లి వెళ్తే ఆమెను కూడా అరెస్టు చేస్తామంటారా? అని ఆవేదన వ్యక్తం చేశారు.
మా ఆస్తులు ప్రజల ముందు ఉంచేందుకు సిద్ధం : 50 రోజులుగా చంద్రబాబును జైలులో ఉంచి ఏం సాధించారు. కొత్త ఆధారం ఒక్కటైనా ప్రజల ముందు పెట్టారా? స్కిల్, ఫైబర్‌నెట్ ఏ కేసులోనైనా కొత్త ఆధారాలు ఏమైనా చూపారా? పార్టీ ఖాతాకు డబ్బులు వచ్చాయని ఒక్క ఆధారమైనా చూపారా?ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ చేస్తున్నా. స్కిల్ కేసులో మా కుటుంబ సభ్యులు, మిత్రుల పాత్ర లేదు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు. మా ఆస్తులు, ఐటీ రిటర్న్‌లు ప్రజల ముందుంచేందుకు సిద్ధంగా ఉన్నాం.
సైకో జగన్‌ను వదిలిపెట్టం : చంద్రబాబును బయటకు రానీయకుండా లాయర్ ఫీజుకు రూ.పదేసి కోట్లు ఖర్చు పెడుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 32 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. రైతులను పట్టించుకునే నాథుడే లేడు. రైతుల కోసం కాకుండా బస్సు యాత్ర పేరుతో గాలి యాత్ర చేస్తున్నారు. నిరుద్యోగ సమస్యతో యువత చాలా ఇబ్బంది పడుతోంది. వైసీపీ నాయకుడికి దారి ఇవ్వలేదని బస్సును ఆపి డ్రైవర్‌పై దాడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దాడి చేసిన వారిపై ఇంతవరకు చర్యలు లేవు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. సైకో జగన్‌ను వదిలిపెట్టం..ప్రజల తరపున పోరాడుతామని లోకేశ్ స్పష్టం చేశారు.