అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు హెల్త్ విషయంలో ప్రభుత్వ తీరుపై తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యం, భద్రత విషయంలో కుట్ర అమలుకు ప్రభుత్వం ఓ కమిటీ వేసిందన్నారు. చంద్రబాబు హెల్త్ రిపోర్టుల విషయంలో ప్రభుత్వ వైద్యులపై ఒత్తిడి ఉందని తెలిపారు. ఈ నెల 25న తన భద్రతపై చంద్రబాబు లేఖ రాస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని దెబ్బ తీసేందుకు ప్రభుత్వం ఏకంగా ఓ కమిటీనే వేసిందనే సమాచారం తమకుందన్నారు. చంద్రబాబు పేరుకే జుడిషియల్ కస్టడీలో ఉన్నారని, కానీ వాస్తవానికి ఆయన ప్రభుత్వ కస్టడీలోనే ఉన్నారన్నారు. క్రిమినల్ మైండ్ ఉన్న నేతలు వైసీపీ నేతలు అంటూ విరుచుపడ్డారు. సొంత బాబాయిని చంపిన వారికి మిగిలిన వారిని చంపడం ఓ లెక్కా అని అన్నారు. చంద్రబాబు హెల్త్ రిపోర్టును ఎందుకు బయట పెట్టడం లేదని నిలదీశారు. హెల్త్ రిపోర్టును డాక్టర్లే వెల్లడి చేయాలని, కానీ చంద్రబాబు విషయంలో జైలు అధికారులే హెల్త్ రిపోర్టులు ఇస్తున్నారన్నారు. ప్రభుత్వ వైద్యులపై విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. చంద్రబాబుకు బ్లడ్ టెస్ట్ చేశారా? చేస్తే ఆ రిపోర్టులు ఎక్కడ?. హెల్త్ రిపోర్టులో ఏం రాయాలో సజ్జల చెబుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబుకు ఉన్న ఇబ్బంది విషయం కాకుండా వేరే అంశాలను ప్రస్తావిస్తూ హెల్త్ రిపోర్టు ఇస్తున్నారన్నారు. చంద్రబాబు హెల్త్ రిపోర్టుల విషయంలో కుట్ర జరుగుతోందని ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని డామేజ్ చేయడానికి కుట్రలు జరుగుతున్నాయన్నారు. చంద్రబాబును అంతమొందించేందుకు కుట్ర పన్నారన్నారు. చంద్రబాబు ఏసీబీ కోర్టుకు లేఖ రాశారని, ఈ నెల 25వ తేదీన చంద్రబాబు లేఖ రాస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఏసీబీ జడ్జి కూడా చంద్రబాబు లేఖ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆ లేఖను వెంటనే పరిగణనలోకి తీసుకుని జడ్జి వెంటనే డైరెక్షన్ ఇవ్వాలని కోరారు. సెక్యూర్టీ ఎరేంజ్మంట్స్ విషయంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదన్నారు. చంద్రబాబుకు విపరీతంగా ఆదరణ పెరుగుతోంది కాబట్టి కుట్ర పూరితంగా జైలుకు పంపారని విరుచుకుపడ్డారు. స్కిల్ కేసు ఓ ఫ్రాడ్ కేసన్నారు. వేల కోట్ల అవినీతి జరిగిందని, ఇప్పుడు రూ. 27 కోట్లకు వచ్చారన్నారు. చంద్రబాబు, ఆయన కుటుంబాన్ని బద్నాం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును ఇరికించారన్నారుు. చాలా రోజుల పాటు చంద్రబాబును జుడిషియల్ కస్టడీలో ఉంచారన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ కేసులు పెడుతున్నారని యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.