ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో విమర్శించడం మంచిది కాదు : టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి
పాత మండపాన్ని యధావిధిగా పునర్నిర్మించాం : టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి
తిరుమల : తిరుమలలో శ్రీ మలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. పార్వేట ఉత్సవం సాధారణంగా మకర సంక్రాంతి మరుసటిరోజైన కనుమ పండుగనాడు జరుగుతుంది. అధికమాసం కారణంగా నిర్వహించే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల మరుసటిరోజు కూడా ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ అత్యంత ప్రాచీనమైన, కూలడానికి సిద్ధంగా ఉన్న పార్వేట మండపాన్ని టీటీడీ అధికారులు అదేరీతిలో పునర్నిర్మించారని, భక్తులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అయితే, ప్రతి ఒక్క విషయాన్ని రాజకీయ కోణంలో చూసి విమర్శించడం సరైన చర్య కాదని, అది పాజిటివ్ దృక్కోణమా, నెగెటివ్ దృక్కోణమా అన్నది ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. సద్విమర్శలు మాత్రమే చేయాలని, భగవంతునికి సంబంధించిన విషయాలలో అవి సలహాలుగా మాత్రమే ఉండాలన్నారు. టీటీడీలోని అర్చకులు, ఆగమపండితులు, ఉన్నతాధికారులు చక్కగా పనిచేస్తారని చెప్పారు. దురుద్దేశంతో మనకు వచ్చిన ఆలోచన మాత్రమే చాలా శాస్త్రీయమైనదని, మనం ఒక్కరమే గొప్పగా విమర్శలు చేయగలమని ఎవరైనా భావిస్తే అది చాలా తప్పిదం అవుతుందని చెప్పారు. ఇలా వ్యవహరించడం చాలా బాధాకరమన్నారు. టీటీడీలోని అధికారులు ఎంతో భక్తితో పనిచేస్తారని, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు తపన పడుతుంటారని అన్నారు. వందల సంవత్సరాల కాలం నాటి నిర్మాణాలను ఉపయోగించకుండా ఉన్నప్పుడు కాపాడుకోవడం తేలికని, వాటిని ప్రతిసారీ ఉపయోగించాల్సి వచ్చినప్పుడు ప్రయోగాలు చేయకూడదని వివరించారు. పార్వేట మండపం చాలా పాతదని, కూలిపోయే స్థితిలో ఉండగా, చక్కగా పునర్నిర్మించారని, భక్తులందరూ అభినందిస్తున్నారని చెప్పారు. టీటీడీకి సంబంధించి విమర్శలు చేస్తే ఒక సలహా రూపంగా ఉండాలికానీ, ఎదుటివారిపై దాడి చేసేలా ఉండకూడదని, వ్యక్తిగత ప్రతిష్ట కోసం ఏం మాట్లాడినా చెల్లుతుందని భావిస్తే భగవంతుని పట్ల అపచారం చేసినవారవుతారని అన్నారు. టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం నూతన మండపంలో పార్వేట ఉత్సవం చేయడం చాలా ఆనందదాయకమన్నారు. పాత మండపం శిథిలావస్థకు చేరుకుందని, మరమ్మతులు చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో దీన్ని జీర్ణోద్ధరణ చేసినట్టు తెలిపారు. పాత మండపంలోని కళాఖండాలను రికార్డు చేసి యధావిధిగా తిరిగి నిర్మించామని, నూతన మండపం అద్భుతంగా వచ్చిందని చెప్పారు. కాగా శ్రీవారి ఆలయంలో ప్రాతఃకాలారాధన పూర్తి అయిన తరువాత శ్రీమలయప్పస్వామివారు తిరుచ్చిపై తిరుమలలోని పాపవినాశన మార్గంలో గల పార్వేట మండపానికి ఊరేగింపుగా చేరుకున్నారు. శ్రీవారికి ఆస్థానం, నివేదన, హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వేదములే నీ నివాసమట విమల నారసింహా, కొండలలో నెలకొన్న, నారాయణతే నమో నమో… తదితర సంకీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. తరువాత ఉభయదార్లకు తాళ్ళపాక వారికి, మఠంవారికి మర్యాదలు చేశారు. వేదపారాయణదారులు సందర్భానుసారంగా వేదమంత్రాలను పఠించారు. అనంతరం పంచాయుధమూర్తిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి శంఖం, చక్రంతోపాటు ఖడ్గం, గద, ఈటె, విల్లు, బాణం తదితర ఆయుధాలు ధరించి పారువేటకు వెళ్లారు. మలయప్పస్వామివారి తరపున టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డితో పాటు అర్చకులు రామకృష్ణ దీక్షితులు ఈటెను మూడుసార్లు విసిరారు. భక్తులు ఆనందంతో ఈ ఘట్టాన్ని తిలకించారు. దుష్టులను శిక్షించి భక్తులను రక్షించడమే ఈ పారువేట అంతరార్థం. ఆ తరువాత శ్రీమలయప్ప స్వామివారు పార్వేట మండపం నుంచి మహాద్వారానికి వచ్చి హతీరాంజీవారి బెత్తాన్ని తీసుకొని సన్నిధికి వేంచేయడంతో పారువేట ఉత్సవం ముగుస్తుంది. ఈ ఉత్సవం కారణంగా ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఈ కార్యక్రమంలో సీఈ నాగేశ్వరరావు, ఎస్ఈ-2 జగదీశ్వర్‌రెడ్డి, ఈఈలు జగన్మోహన్రెడ్డి, శ్రీహరి, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, డీఈ ఎలక్ట్రికల్ రవిశంకర్‌రెడ్డి, వీజీఓలు బాలిరెడ్డి, గిరిధరరావు, డెప్యూటీ సీఎఫ్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.