మొదటి నుంచి వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను దుర్వినియోగం చేస్తోంది
ఐబీ సిలబస్ అమలు వెనుక పెద్ద కుంభకోణం
ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడడం కోసం ఇన్ని వేల కోట్ల ఖర్చు అవసరమా?.
ఈ వ్యవహారంపై వైసీపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలి
మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమవేశంలో పవన్ కళ్యాణ్
గుంటూరు : ప్రభుత్వం మారిన వెంటనే మొట్టమొదటగా వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యాశాఖలో చోటు చేసుకున్నా అవినీతి, చేసిన కుంభకోణాలపై దృష్టిపెడతాం. విద్యా శాఖలో ప్రస్తుతం జరుగుతున్న అవినీతి పనుల్లో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ జైలుకి పంపుతామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. పతనావస్థలో ఉన్న కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చి విద్యా వ్యవస్థను దుర్వినియోగం చేశారన్నారు. విద్యార్ధులకు అన్యాయం జరిగితే జనసేన పార్టీ కచ్చితంగా గొంతెత్తుందన్నారు. ఈ క్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ జనసేన పార్టీ గురించి మాట్లాడినా, కించపర్చే విధంగా మాట్లాడినా పట్టించుకునేది లేదని స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి విద్యా వ్యవస్థలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. విద్యార్ధులను అయోమయానికి గురి చేస్తోంది. ఇంగ్లీష్ మీడియం అంశం మీద సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తే మేమేదో ఇంగ్లీష్ మీడియంకి వ్యతిరేకం అని అవాకులుచవాకులు మాట్లాడారు. మా ఉద్దేశాన్ని పరిగణలోకి తీసుకోలేదు. విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో యూనివర్సిటీలకు వెళ్లే విద్యార్ధులకు టోఫెల్ టెస్ట్ అవసరం. 3వ తరగతి, 5వ తరగతి పిల్లలకు టోఫెల్ టెస్ట్ పెట్టడం వెనుక లాజిక్ అర్ధం కావడం లేదన్నారు.
బొత్స ఇంగ్లీష్ ఏ యాక్సెంట్?
మంత్రి అయ్యారు కదా
ఇలాంటివాటిపై ప్రశ్నిస్తే ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడటం కోసమే అని చెబుతున్నారు. దాని కోసమే అయితే ఇన్ని వేల కోట్ల ఖర్చు అవసరం లేదు. యూట్యూబ్ లో చాలా ఆన్ లైన్ కోర్సులు ఉన్నాయి. ఏ యాక్సెంట్లో మాట్లాడాలో ఉచితంగా చెబుతారు. విద్యార్ధులు దానిలో ఎన్ రోల్ అయితే సరిపోతుంది. దానికి డబ్బులు కూడా అవసరం లేదు. ప్రభుత్వం సమయం ఇస్తే చాలు. బ్రిటీష్ యాక్సెంట్ ఉన్న ఇంగ్లీష్ నేర్చుకుంటే తప్ప, అమెరికన్ యాసలో ఇంగ్లీష్ మాట్లాడితే తప్ప జీవితంలో ఎదగలేమనే తప్పుడు భావన కల్పిస్తున్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం లాంటి భారతీయ శాస్త్రవేత్తలు ఏ యాక్సెంట్ మాట్లాడేవారు? మంత్రి బొత్స, ముఖ్యమంత్రి విదేశీ యాక్సెంట్ తో మాట్లాడకున్నా పదవులు వచ్చేశాయి. పిల్లలకు ఆలోచనా శక్తితో కూడిన సృజనాత్మకతతో బోధన అవసరం. భాష కేవలం ఒక ఉపకరణం లాంటిది మాత్రమే. ఇంగ్లీష్ నేర్చుకుంటేనే అద్భుతాలు జరుగుతాయంటే అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో పేదరికం ఉండకూడదు. ఎవరూ రోడ్ల మీద పడుకోకూడదు. న్యూయార్క్ లో ఇంగ్లీష్ మాట్లాడే వారంతా అద్భుతాలు సాధిస్తున్నారనుకుంటే పొరపాటు.
జెనీవాలో ఆర్బిట్రేషన్ ఏమిటి?
ఐబీ సిలబస్ కావాలంటే ప్రతి స్కూలు రూ. 10 నుంచి రూ.12 లక్షలు చెల్లించాలి. ప్రభుత్వంలో ఉన్నవారు అవగాహన లేమితో చేస్తున్నారో, స్కామ్ చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నారో తెలియడం లేదు. విదేశీ కంపెనీలతో ఒప్పందం పెట్టుకున్న తర్వాత ఉల్లంఘన జరిగితే ఆర్బిటిరేషన్ చాలా చిక్కులతో కూడుకుని ఉంటుంది. వొడాఫోన్ ఒప్పందం ఉల్లంఘన జరిగితే పారిస్ లో ఉన్న భారత దౌత్యవేత్తల కార్యాలయాలు సీజ్ చేయమన్నారు. ఇది చాలా ప్రమాదం. జెనీవాలో ఆర్బిటిరేషన్ సాధ్యమయ్యే పని కాదు. దేశం మొత్తం మీద 210 స్కూల్స్ కి ఐబీ సిలబస్ ఉంది. ఇప్పుడు రాష్ట్రంలోని అన్నీ పాఠశాలల్లో దీన్ని అమలు చేయాలంటే.. కేవలం టీచర్ల శిక్షణ కోసమే ఏడాదికి రూ. 1200 కోట్ల ఖర్చు అవుతుంది. ఇందులో స్కామ్ జరుగుతోందన్న బలమైన అనుమానాలు ఉన్నాయి. దీనిపై వైసీపీ ప్రభుత్వం కచ్చితంగా సమాధానం చెప్పాలి. మంత్రి బొత్స మేము చెప్పినదాన్ని సదుద్దేశంతో తీసుకుని వివరణ ఇవ్వాలన్నారు.
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యాశాఖ నిర్వీర్యం : నాదెండ్ల మనోహర్
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెరుగైన సేవలు అందిస్తున్నామనే సాకుతో వైసీపీ నాయకులు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యాశాఖ నిర్వీర్యం అవుతోంది. ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి విదేశీ సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం దారుణం. ఐబీ (ఇంటర్నేషనల్ బెకాలారెట్) సిలబస్ ను పాఠశాలల్లో ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దానికి క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. టీచర్లకు ట్రైనింగ్ కూడా ఈ సంస్థ ద్వారే ఇస్తామని చెబుతున్నారు. దీని కోసం ప్రతి ఏడాది రూ. 1200 నుంచి రూ. 1500 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. అదీ కూడా సింగపూర్ డాలర్స్ లోనే చెల్లిస్తామని ఒప్పందం చేసుకున్నారు. స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా చట్టాలు తప్ప మనదేశంలోని చట్టాలు ఈ సంస్థకు వర్తించవు అని ఒప్పందంలో ఉంది. ఇన్ని క్లాజ్ లు పెట్టుకొని మంత్రి గారు ఎలా సంతకం పెట్టారు? 44,381 ప్రభుత్వ పాఠశాలు, 10వేల ప్రైవేటు పాఠశాలలు, 970 ఎయిడెడ్ పాఠశాలల్లో ఐబీ సిలబస్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. న్యాయ, ఆర్ధిక శాఖలు ఒప్పందాన్ని తిరస్మరించినా ముఖ్యమంత్రి కోరిక మేరకు ప్రజాధనానికి నష్టం వాటిల్లుతున్నా ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. జాతీయ విద్యా విధానం మేరకు మాతృభాషలో విద్య నేర్పించాలని స్పష్టంగా ఉన్నా ఇంగ్లీష్ భాషను బలవంతంగా రుద్దుతున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులను ఎందుకు ఇబ్బందిపెడుతున్నారని అడిగితే పేద విద్యార్థులు ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం మీకు ఇష్టం లేదా? అని మమ్మల్నే ప్రశ్నిస్తున్నారు.
అమ్మ ఒడిలో కుంభకోణం
అమ్మఒడి పథకం 42,61,965 మంది విద్యార్థులకు ఇచ్చామని ప్రభుత్వం గర్వంగా చెబుతోంది. విద్యా కానుక కింద 39,95,992 మంది విద్యార్థులకు మేలు జరిగింది అని చెప్పింది. 2023 జూలైలో చేసిన జీఈఎస్ సర్వే ప్రకారం 37,50,293 మంది విద్యార్థులు మాత్రమే పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థులే 37 లక్షల మంది ఉంటే అమ్మఒడి 42 లక్షల మందికి ఎలా ఇచ్చారో ప్రభుత్వం లెక్క చెప్పాలి. ఒక్కొక్కరికి రూ.13 వేల చొప్పున 5,71,679 విద్యార్థులకు లెక్కిస్తే రూ. 743.18 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? అమ్మఒడి పథకంలో భారీ ఎత్తున అవినీతి జరిగింది.
అమెరికా ప్రతి ఏడాది దాదాపు 40 వేలు విద్యా వీసాలకు మాత్రమే అనుమతి ఇస్తుంటే, మన రాష్ట్రంలో మాత్రం 30 లక్షల మంది విద్యార్థులకు టోఫెల్ పరీక్షలు పెడతామనడం వెనక ఎవరి స్వలాభం దాగుంది. వంద కోట్లు దాటిన ప్రతి కాంట్రాక్ట్ ను సిట్టింగ్ జడ్జితో న్యాయ సమీక్ష చేస్తామని చెప్పారు. ఈ రెండు ఒప్పందాలపై ఎందుకు న్యాయ సమీక్ష చేయలేదు..?. విద్యాశాఖలో జరిగిన అవినీతిని అన్ని ఆధారాలతో బయటపెడతామని అన్నారు.