బాపు మ్యూజియంలో నూతన ఆప్కో షోరూమ్ ప్రారంభం
విజయవాడ : యువత అకాంక్షలకు అనుగుణంగా రెడిమేడ్ చేనేత వస్త్రాలను అందుబాటులోకి తీసుకువచ్చామని రాష్ట్ర చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత తెలిపారు. నగరంలోని బాపు మ్యూజియంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆప్కో షోరూమ్ ను పురావస్తుశాఖ కమీషనర్ డాక్టర్ వాణీ మోహన్ తో కలిసి గురువారం సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేనేత కార్మికులకు గణనీయమైన ఉపాధి చూపాలన్న ధ్యేయం మేరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలో నూతన షోరూమ్ లను ప్రారంభిస్తున్నామన్నారు. గురువారం ఒకే రోజు ఇటు విజయవాడ, ఏలూరు, విశాఖపట్నంలలో షోరూమ్ ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. నూతన ష్యాషన్లకు అనుగుణంగా బాపు మ్యూజియం షోరూమ్ ను తీర్చిదిద్దామన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని రకాల వస్త్రాలపై 30 శాతం ప్రత్యేక రాయితీని అందిస్తున్నామని పేర్కొన్నారు. నాణ్యతకు మన్నికకు పేరెన్నికగన్న ఆప్కో వస్త్రాలను ధరించి నేత కార్మికులకు నిత్యం పని దొరికేలా ప్రోత్సహించవలసిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా హాజరైన వాణీ మోహన్ మాట్లాడుతూ అందరికీ అందుబాటులో బాపు మ్యూజియంలో ఆప్కో షోరూమ్ ఏర్పాటు కావటం మంచి విక్రయాలకు దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఆప్కో జిఎంలు తనూజా రాణి, బి. నాగేశ్వరరావు, ఎం.నాగేశ్వరావు, డివిజినల్ మార్కెటింగ్ అధికారి రఘునంద తదితరులు పాల్గోన్నారు.