అసాంఘిక శక్తుల అడ్డాగా పులివెందుల
ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటి చైర్మెన్ డా.ఎన్.తులసీ రెడ్డి
కడప, సూర్య బ్యూరో ప్రతినిధి : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లాలో సాగునీటి రంగంపై శీతకన్ను వేశారని కడప జిల్లాలో మేజర్, మీడియం, మైనర్ సాగునీటి ప్రాజెక్టుల ద్వారా 9 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉన్నప్పటికీ ప్రధాన కాలువలు, ఉపకాలువలు, పంట కాలువలు లేనందున 9వేల ఎకరాలకు కూడా నీరందించలేకపోవడం శోచనీయమని, చిత్తశుద్ధి లేకపోవడం,నిధుల కొరత ప్రధాన కారణమని మాజీ రాజ్యసభ సభ్యులు ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీమీడియా కమిటి చైర్మెన్ డా.ఎన్.తులసీ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జనచైతన్య వేదిక ఆద్వర్యంలో కడపజిల్లా సమగ్రాభివృద్దిపై జరిగిన చర్చా వేదికలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డా. ఎన్ తులసి రెడ్డి ప్రసంగిస్తూ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపనల స్పెషలిస్ట్ గా మారారని, కడప ఉక్కు ఫ్యాక్టరీకి రెండుసార్లు శంఖుస్థాపన చేసి ఒక్క రూపాయి కూడా వ్యయం చేయలేదని అన్నారు. కొప్పర్తి పారిశ్రామిక వాడ నిర్వీర్యం అయ్యిందని, పులివెందుల అసాంఘిక శక్తుల అడ్డాగా మారిందని, జగన్ అభివృద్ధి నిరోధకునిగా చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు.
ప్రధాన వక్తగా విచ్చేసిన టి.డి.పి పోలిట్ బ్యూరో సభ్యులు ఆర్. శ్రీనివాసుల రెడ్డి ప్రసంగిస్తూ కడప-పెండ్లిమర్రి-రాయచోటి-బెంగుళురు నూతన బ్రాడ్ గేజ్ రైలు మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసి 21.3 కిలోమీటర్లు పూర్తి చేసిన తరువాత జగన్ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా రైల్వే శాఖ పనులు ఆపేసిందన్నారు. ఇంతటితో ఆగకుండా కడప – బెంగుళూరు రైల్వే ప్రాజెక్టు అవసరం లేదని ముఖ్యమంత్రి జగన్ రైల్వే బోర్డుకు, కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన కారణంగా ఆ ప్రాజెక్టు రద్దయిందని తద్వారా జగన్ రాయలసీమ ద్రోహిగా రాయలసీమ ప్రజలలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి నుండి విశాఖకు తరిలిస్తే కడప జిల్లాకు రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. కడప జిల్లాలో ఖనిజ సంపద, వృక్ష సంపద సమృద్దిగా ఉన్నా పారిశ్రామికీకరణ జరగనందున నిరుద్యోగ సమస్య తీవ్రమై వలసలు పెరుగుతున్నాయన్నారు.
జనసేన పార్టీ రాష్ట్ర నేత సుంకర శ్రీనివాస్ ప్రసంగిస్తూ కడపజిల్లాలో పాలెగాళ్లు, పెత్తందార్ల పెత్తనంతో పేదలు నలిగిపోతున్నారని, సహజ వనరులు దోపిడీకి గురవుతున్నాయని, చట్టబద్ద పాలన కరువైందని, ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కుతున్నారని, వ్వవస్థలన్నీ నిర్వీర్యం అవుతున్నాయని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ మూడుముక్కలాటతో రాజధాని లేని రాష్ట్రంగా మారిందన్నారు. ఆంద్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాలలో తలసరి ఆదాయంలో అట్టడుగున ఉందని, కడపలో అన్నమయ్య ప్రాజెక్టు వరదలలో కొట్టుకుపోయినా ఇప్పటివరకు పునర్నిర్మాణం చేపట్టలేదన్నారు. రాజోలు జలాశయానికి 2019 నుండి ఒక్కరూపాయి మంజూరు చేయలేదన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేశారని, విద్వేష రాజకీయాలు పోత్సహిస్తున్నారని వివరించారు. విభజన చట్టం అమలు కోసం కేంద్ర ప్రభుత్వంతోనూ, తెలంగాణ ప్రభుత్వం తోనూ పోరాడలేని నిస్సహాయ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. అభివృద్ధి ప్రాధాన అజెంగా రాబోవు ఎన్నికలలో ఉండేటట్టు జనచైతన్య వేదిక కృషిచేస్తుందన్నారు. ఉమ్మడి జిల్లాలలో ఆయా జిల్లాల సమగ్రాభివృద్దిపై చర్చాగోష్టులు నిర్వహిస్తామని తెలిపారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య ప్రసంగిస్తూ పాలకులు వ్యాపారులై ప్రజలు బిచ్చగాళ్ళుగా మారుతున్నారని కడప జిల్లాలో ఉన్న అపార ఖనిజ సంపద, ఎర్ర చందనం అధికార పార్టీ నేతల ధనార్జనకు బలైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ ప్రసంగిస్తూ ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీలో నిధుల కొరత కారణంగా విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయన్నారు. తెలుగు సూర్యుడుగా ప్రసిద్ధి గాంచిన, యోగివేమనను తెలుగు ప్రజలకు పరిచయం చేసిన సి.పి. బ్రౌన్ గ్రంథాలయ అభివృద్ధిని విస్మరించడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు దేవర శ్రీ కృష్ణ, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ డాక్టర్ బేరిల్ల శ్రీనివాస్, బహుజన సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సగిల గుర్రప్ప, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నేత కె.లింగమూర్తి, జనవిజ్ఞాన వేదిక జాతీయ ఉపాధ్యక్షులు బి. విశ్వనాధ, జనవిజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి పి. శంకరయ్య, ఫై ఈ టీ జిల్లా కార్యదర్శి పి. రమేష్ తదితరులు ప్రసంగించారు.