రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఇంద్రకీలాద్రి పై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి ఉన్న ప్రత్యేకతలలో లడ్డు ప్రసాదం కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగింది. అమ్మవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరు ఎక్కువ మొత్తంలో లడ్డూలు కొనుగోలు చేస్తారు. సాధారణంగా మామూలు రోజుల్లోనే ఈ లడ్డు ప్రసాదానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. నవరాత్రి ఉత్సవాల రోజులలో ఈ డిమాండ్ మరింత పెరుగుతుంది. శరన్నవరాత్రి ఉత్సవాలకు వస్తున్న భక్తులకు కోరిన లడ్డూలు అందించేందుకు దేవస్థానం సిద్ధమైంది. గురువారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు లడ్డూ ప్రసాద తయారీ కేంద్రం (లడ్డూ పోటు), లడ్డు ప్రసాదం విక్రయ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నవరాత్రి ఉత్సవాలలో ఇప్పటివరకు ప్రతిరోజు 60 నుంచి 70 వేల వరకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. మొత్తంగా నవరాత్రి ఉత్సవాలలో 25 లక్షల లడ్డూలు విక్రయించే అవకాశం ఉందన్నారు. శుక్రవారం మూలా నక్షత్రం సందర్భంగా భక్తుల సంఖ్య అసాధారణ స్థాయిలో ఉంటుందన్నారు. అదే సమయంలో లడ్డు ప్రసాదానికి కూడా డిమాండ్ పెరుగుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని రెండున్నర నుంచి మూడు లక్షల లడ్డూలను ఇప్పటికే సిద్ధంగా ఉంచామన్నారు. శుక్రవారం నాటి రద్దీని దృష్టిలో పెట్టుకొని అవసరమైతే ప్రసాద విక్రయ కేంద్రాలను అప్పటికప్పుడు పెంచేందుకు దేవస్థానం సిబ్బంది సిద్ధంగా ఉన్నారని వివరించారు. ఇప్పటికే కనకదుర్గ నగర్ తో పాటు రైల్వే స్టేషన్, బస్టాండ్, భవాని ఘాట్లలో కూడా ప్రసాద విక్రయ కేంద్రాలు ఉన్నాయని భక్తులు ఆయా కేంద్రాల్లో కూడా కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. అనంతరం ఆయన లడ్డూపోటు కేంద్రాన్ని సునిశితంగా పరిశీలించారు. లడ్డు ప్రసాద తయారీకి వినియోగిస్తున్న ముడి సరుకుల నాణ్యత కూడా పరిశీలించారు. లడ్డూలు ఎక్కువ కాలం నిలువ ఉండేలా అత్యంత నాణ్యత కలిగిన శనగపిండి, పంచదార, నూనె, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి వాడుతున్నట్లుగా గమనించారు. అత్యంత పరిశుభ్ర వాతావరణంలో ఈ లడ్డు ప్రసాదం తయారు అవుతోందని వివరించారు. లడ్డు తయారీ కేంద్రాల నుంచి ఇతర ప్రాంతాల లడ్డు విక్రయ కేంద్రాలకు రవాణా చేసే సమయంలో రవాణా వాహనాలకు ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను చక్క దిద్దాలని పోలీస్ శాఖను ఆదేశించారు. ప్రధానంగా ద్విచక్ర వాహనాలు ఇష్టానుసారంగా నిలిపేయడంతో ఎదురౌతున్న ఈ సమస్యలపై పోలీసులు దృష్టి పెట్టాలని చెప్పారు.
మూలా నక్షత్రం రోజు జగన్మాత సరస్వతి దేవిగా దర్శనం ఇస్తారు. మన పురాణ గ్రంధాల ప్రకారం అలంకారాలలో అలంకారానికి ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది. సర్వ విద్యలకు అనుష్టాన దేవత అయిన సరస్వతి రూపాన్ని దర్శించేందుకు సంఖ్యలో వచ్చే భక్తులకు అవసరమైన ఏర్పాట్లు అన్ని ఇప్పటికే పాలకమండలి సిద్ధం చేసిందన్నారు. ప్రధానంగా ట్రాఫిక్ నియంత్రణ, క్యూలైన్ల క్రమబద్దీకరణ, అన్నదానం కేంద్రాలలో ఏర్పాట్లు, మంచినీరు, మజ్జిగ, పసిపిల్లలకు వేడి పాలు వంటి అవసరాలతో పాటు అత్యవసర వైద్య సేవలు కూడా అందుబాటులో ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ క్షేత్రస్థాయి పర్యటనలో దేవస్థానం సహాయ కార్య నిర్వహణ అధికారి ఎన్. రమేష్, సిబ్బంది లక్ష్మణ స్వామి, ఎం ఎస్ ఆర్ కె ప్రసాద్, గుత్తేదారు ఎం. చందు కలెక్టర్ వెంట ఉన్నారు.