ఆరోగ్య సురక్షలో 63 రకాల వైద్య పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్
పోలాకి : సంపూర్ణ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారని , అందులో భాగంగానే ప్రజల ముంగిటకు మెరుగైన వైద్యం అందించే ఈ జగనన్న సురక్ష కార్యక్రమం అని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు నరసన్నపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణ దాస్ పేర్కొన్నారు. బుధవారం పోలాకి మండలం తలసముద్రం సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఉచిత వైద్య పరీక్షలు, వైద్యం, మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. వైద్యాన్ని మన ఇంటి వద్దకే నేరుగా తీసుకువచ్చిన ఘనత మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో సుమారు 63 రకాల వైద్య పరీక్షలు, 112 రకాల మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో అవసరానికి ఒక అంబులెన్స్ ను కూడా అందుబాటులో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ ముద్దాడ బైరాగి నాయుడు, పోలాకి మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, డాక్టర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది అభిమానులు పాల్గొన్నారు.