తొలిసారి 51 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా అమలు
దశలవారీగా విస్తరించేందుకు సన్నాహాలు
మళ్లీ 2,526 గ్రామ సచివాలయాల్లో ఈ సేవలు
పారదర్శకంగా పౌర సేవలు : ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ
గుంటూరు : రాష్ట్రంలోని మరో 2,526 గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. తొలిదశలో 51 గ్రామాల్లో, రెండోదశలో 1500 గ్రామల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు మళ్లీ 2,526 గ్రామాల్లో ఈ సేవలు ప్రారంభించనున్నది. ఇందుకోసం సచివాలయాలను సబ్ డిస్ట్రిక్టులుగా నోటిఫై చేసి, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా ప్రభుత్వం ప్రకటించింది.
గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం, అన్ని గ్రామాల్లో శరవేగంగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది. తాజాగా 2,526 గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు చేసేందుకు అనుమతులు మంజూరు చేసింది. రీ సర్వే పూర్తయి, ఎల్పీఎం (ల్యాండ్ పార్సిల్ నంబర్) వచ్చిన గ్రామాల్లో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది. తొలిసారి 51 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ప్రారంభించి, రెండోదశలో 1500 గ్రామ సచివాలయాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకురాగా, ఇప్పుడు మళ్లీ 2,526 గ్రామ సచివాలయాల్లో ఈ సేవలు ప్రారంభించనున్నది. ఇందుకోసం సచివాలయాలను సబ్ డిస్ట్రిక్టులుగా నోటిఫై చేసి, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా ప్రభుత్వం ప్రకటించింది.
బాధ్యతలు ఎవరికంటే : అక్కడ పనిచేసే కార్యదర్శులకు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదా అధికారం కల్పించారు. డిజిటల్ అసిస్టెంట్లు రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో కార్యదర్శులకు సహకరించే అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇందుకోసం సీఎస్ జవహర్ రెడ్డి మూడు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేశారు. ఇప్పటివరకు గ్రామ సచివాలయాల్లో 4 వేలకుపైగా రిజిస్ట్రేషన్లు చేశారు. ఇందుకోసం సచివాలయాల కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లకు రిజిస్ట్రేషన్ వ్యవహారాలపై శిక్షణ ఇచ్చారు. గ్రామ సచివాలయాలతోపాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. భూముల రీ సర్వే తొలి దశలో 2 వేల గ్రామాలు, రెండో దశలో మరో 2 వేల గ్రామాల్లో పూర్తవడంతో ఆ గ్రామాల్లో రిజిస్ట్రేషన్ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. త్వరలో మరో 2 వేల గ్రామాల్లో సర్వే పూర్తయ్యే అవకాశాలుండడంతో అక్కడ కూడా రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభంకానున్నాయి.
ఆస్తుల రిజిస్ట్రేషన్ ఇక సులభతరం : ఆయా గ్రామాల ప్రజలు ఇకపై ఆస్తుల రిజిస్ట్రేషన్లను తమ సచివాలయాల్లోనే సులభంగా చేసుకోవచ్చు. తాజాగా అనుమతించిన గ్రామాలతో కలిపి మొత్తం 4,077 గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అనుమతించినట్లయింది. అలాగే ముఖ్యమైన రిజిస్ట్రేషన్లు, ఈసీలు పొందడం వంటి పనుల్ని ఈ కార్యాలయాల్లోనే చేసుకోవచ్చు.
రెవిన్యూ శాఖలో మరింత పారదర్శకత కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్న ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో రెవిన్యూ సేవలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తవమవుతున్న నేపథ్యంలో పారదర్శకంగా పౌర సేవల్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖలో మరింత పారదర్శకతకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందించే సేవలపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఆరోపణలు, అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో అన్ని కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ ్రకటనల్ని ఏర్పాటు చేస్తున్నారు. నిజానికి రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లంచగొండితనం నిరోధించేందుకు సిసి కెమెరాలు, ఆన్లైన్ ప్రక్రియను ఎప్పుడో మొదలుపెట్టినా అవి విజయవంతం కాలేదు.
ఏపీలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాలనా యంత్రాంగాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. వాటిలోనే అన్ని రకాల పౌర సేవల్ని అందిస్తామని ప్రకటించింది. రెండున్నరేళ్ల క్రితం గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటైనా వాటిలో ఇంకా పూర్తి స్థాయిలో అన్ని రకాల సేవలు అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ సేవల్ని వీలైనంత త్వరగా గ్రామ సచివాలయాల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో ఎవరైనా లంచాల కోసం ఒత్తిడి చేస్తే ఫిర్యాదు చేసేందుకు అవినీతి నిరోధక శాఖ 14400 టోల్ ఫ్రీ నెంబర్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. దళారుల ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్ సేవలను గ్రామాలకు తెచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది.
ప్రస్తుతం 51 గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి వచ్చాయని, రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 వేల గ్రామాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. సచివాలయాల్లో 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా డేటా ఎంట్రీ విధానం ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.
రిజిస్ట్రేషన్ కార్యకలాపాలను వికేంద్రీకరించే ప్రక్రియలో భాగంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవల్ని అందుబాటులోకి తీసుకువస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు రిజిస్ట్రేషన్ సేవల్ని నేరుగా నిర్వహించుకునేందుకు వీలుగా పబ్లిక్ డేటా ఎంట్రీ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. టైమ్ స్లాట్ బుక్ చేసుకోవడం ద్వారా 20నిమిషాల వ్యవధిలోనే సబ్ రిజిస్ట్రర్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చన్నారు. దీంతో పాటు జిల్లా రిజిస్ట్రార్లు ప్రతి వారం కనీసం మూడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించినట్లు చెప్పారు. గ్రామ సచివాలయాల్లో దస్తావేజుల రిజిస్ట్రేషన్, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్స్, మార్కెట్ వాల్యూ ధృవీకరణలు, వివాహాల రిజిస్ట్రేషన్లు చేయనున్నారు.