కాకినాడ దళిత రౌండ్ టేబుల్ సమావేశంలో టిడిపి మాజీ మంత్రులు నక్క ఆనంద్ బాబు, కేఎస్ జవహర్
హాజరైన సిపిఐ, సిపిఎం నాయకులు తాటిపాక మధు, దువ్వా శేషు బాబ్జి, జనసేన నేత పిట్ట, తదితర అఖిలపక్ష నేతలు
కాకినాడ : దళితుల ఓట్లతో ఖ్ధికారంలోకి వచ్చిన దళితులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నట్టేట ముంచుతున్నారని టిడిపి మాజీ మంత్రులు నక్క ఆనంద్ బాబు, కేఎస్ జవహర్ ఆరోపించారు. సోమవారం కాకినాడ పట్టణంలోని కోకనాడా కాస్మో క్లబ్ లో ఏర్పాటు చేసిన “హంతకుడు అనంతబాబు దళితాగ్రహభేరి రౌండ్ టేబుల్ సమావేశం” లో టిడిపి మాజీ మంత్రులు నక్క ఆనంద్ బాబు, కేఎస్ జవహర్ పాల్గొన్నారు. సీఎం జగన్ దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా, వైసీపీ ప్రభుత్వ పాలనలో దళితులపై జరుగుతున్న హత్యలు, దాడులు, వేధింపులపై కాకినాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో హంతకుడు అనంతబాబు దళితాగ్రహభేరి రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, కె. ఎస్ జవహర్,కొండ్రు మురళి, గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఐటాబత్తుల ఆనంద రావు, టీడీపీ నాయకులు మద్దిపాటి వెంకట రాజు, మహాసేన రాజేష్, కాసి నవీన్ కుమార్, మోకా ఆనంద్ సాగర్, అంబటి చిన్న, కొల్లాబత్తుల అప్పారావు, పలివెల రవి, జనసేన నాయకులు, దళిత సంఘ నాయకులు, సిపిఐ నాయకులు తాటిపాక మధు, అఖిలపక్ష నాయకులు, వీధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, దళిత మేధావులు హాజరయ్యారు.
దళితుడు అయిన వీధి సుబ్రహ్మణ్యం ను చంపిన ఎమ్మెల్సీ అనంతబాబును సీఎం జగన్ ఎందుకు భుజాలపై మోస్తున్నారు. దళితులంటే జగన్ రెడ్డికి ఎందుకంత చులకన భావం?. దళితుల పట్ల ముఖ్యమంత్రి జగన్మోహరెడ్డి పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారని, దళితుడిని చంపి డోర్ డెలివరి చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ ఇప్పించి పార్టీ సభలు, సమావేశాల్లో జగన్ తన పక్కనే తిప్పుకుంటున్నారని ఆరోపించారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించిన వైసీపీ అధిష్టానం అనంతబాబును మళ్లీ ఎందుకు పార్టీలోకి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించిందన్నారు. బెయిల్ పై వచ్చిన అనంతబాబు తమను బెదిరిస్తున్నాడని హత్యకు గురైన సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు వాపోతున్నా వారికి కనీస రక్షణ కల్పించకపోవటంతో వారు వేరే ప్రాంతానికి వెళ్లి తలదాచుకుంటున్నారన్నారు. కానీ అనంతబాబు మాత్రం బహిరంగంగా ఊరేగుతున్నాడు. వైసీపీ సభలు, సమావేశాల్లో అనంతబాబుకు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలకడాన్ని యావత్ దళితజాతి జీర్ణించుకోలేకపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దళిత యువకుడిని బహిరంగంగా హత్య చేసిన అనంతబాబును ముఖ్యమంత్రి ఎందుకు భుజాలపై మోస్తున్నారు. దీని ద్వారా ఏం సంకేతం ఇస్తున్నారు? ఇది యావత్ దళిత జాతిని అవమానించడమే?. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగన్ రెడ్డి దళితులను అడుగడుగునా ఆర్దికంగా, రాజకీయంగా సామాజికంగా అణిచివేస్తున్నారు. రాజ్యంగబద్దంగా రావాల్సిన సబ్ ప్లాన్ నిధులు సైతం దారి మళ్లించి దళితులకు తీరని ద్రోహం చేస్తున్నారు. దళిత వ్యతిరేక విధానాలను, దళితులపై సాగిస్తున్న దమనకాండను మీరు మౌనంగా చూస్తు ఉండటం దుర్మార్గమన్నారు.
దళిత వ్యతిరేక ప్రభుత్వ విధానాలను వైసీపీ నేతల దమనకాండను ప్రశ్నిస్తున్న దళిత నాయకుల పై దాడి చేసి అక్రమ కేసులు పెడుతున్నా మీరు నోరు విప్పకుండా మౌనంగా ఉంటూ ద్రోహులుగా నిలిచిపోతున్నారు. దళితులు నా మేనమామలు అని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక దళితులపైన్నే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. విదేశీ విద్య, ఎన్టీయార్ స్టడీ సర్కిల్స్, బెస్ట్ అవలబుల్ స్కూల్స్ వంటివాటిని రద్దు చేసి దళితులు విద్యా పరంగా ఎదగకుండా అడ్డుకున్నారు. మరో వైపు సంక్షేమ పథకాలను నిలిపేసి వారిని ద్రోహం చేశారు. సెంటు పట్టా భూమితో దళితుల అసైన్డ్ భూములను లాక్కున్నారు. వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారు. కార్పొరేషన్ రుణాలను రద్దు చేసి దళిత యువతకు ఉపాధి లేకుండా చేశారు. ప్రభుత్వ సలహాదారులు, రాజ్యసభ సభ్యుల నియామకంలో దళితులకు అన్యాయం చేశారు.
దళితులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అఘాయిత్యాలు, అరాచకాలు నిత్యకృత్యమయ్యాయన్నారు. కరోనాలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ని మానసికంగా వేధించి చంపారు. కడపలో డాక్టర్ అచ్చెన్నను కులం పేరుతో వేధించి హతమార్చారు. చీరాలలో మాస్క్ పెట్టుకోనందుకు కిరణ్ ను పోలీసులు కొట్టి చంపారు. రాజమండ్రిలో వైసీపీ నేతల ఇసుక మాఫియాను ప్రశ్నించినందుకు వరప్రసాద్ కు శిరో ముండనం చేశారు. సీఎం సొంత నియోజకవర్గ కేంద్రంలోనే దళిత మహిళ నాగమ్మ పై అత్యాచారం చేసి హత్య చేసినా చర్యలు లేవు. తాడేపల్లిలోని సీఎం నివాసానికి కూతవేటు దూరంలో దళిత యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటనలో అసలు నిందితుడు వెంకట్ రెడ్డిని ఇంతవరకు అరెస్టు చేయలేదు. వైసీపీ నాలుగేళ్ల పాలనలో దళితులకు ప్రతిరోజు అన్యాయాలు, అవమానాలు, వేధింపులు ఎదురౌతున్నా వైసీపీలోని దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించడంలేదు. ఈ అన్యాయాలు మీ కళ్లకు కనిపించడంలేదా? మీ జాతి ప్రయోజనాల కంటే మీ పదవులే ముఖ్యమా? ఈ అన్యాయాలను ప్రశ్నించకుండా ఎన్నాళ్ళిలా జగన్ కు భజన చేస్తూ మీ పదవులకై ప్రాకులాడుతారు? మీకు మీ జాతి ప్రయోజనాలు కావాలన్నా, ఆత్మ గౌరవంతో బతకాలన్నా వెంటనే వైసీపీకి రాజీనామా చేయాలన్నారు. తాను 16 నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి ఎలాగైనా చంద్రబాబుని జైల్లో పెట్టాలని జగన్ అధికారంలోకి వచ్చినప్పుడే అనుకున్నాడు. తాను అనుకున్నది చేసి ఇప్పుడు శునకానందం పొందుతున్నాడు. ఎందుకంటే జగన్ అవినీతిపరుడని ప్రజలు నమ్మారు కాబట్టి. కానీ నేడు చంద్రబాబు అరెస్ట్ పై ప్రజల నుంచి రోజురోజుకీ ఆందోళనలు ఉద్యమాలు ఉధృతమవుతుంటే, వాటినుంచి తప్పించుకోవడానికి అరెస్ట్ విషయం తనకు తెలియ దని నంగనాచి కబుర్లు చెబుతున్నాడని విమర్శించారు.