విశాఖపట్నం : ఉత్తరాంధ్రపై సీఎం జగన్ కపట ప్రేమ చూపిస్తున్నారని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. సోమవారం గంటా శ్రీనివాసరావు ఇంటివద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నల్ల బెలూన్లు ఎగురవేత కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి పోలీసులు విఫలయత్నం చేశారు. దీంతో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు వస్తే వినతిపత్రాలు తీసుకునే ఆనవాయితీ ఉండేదన్నారు. జగన్ విశాఖ పర్యటనలో అవేమీ లేవని, పైగా ప్రతపక్షాలను నిర్భంధిస్తున్నారని మండిపడ్డారు. కలవడానికి లెటర్ ఇచ్చినందుకు అరెస్ట్ చేస్తారా?. ఇది నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. సుప్రీంకోర్ట్‌లో చంద్రబాబుకు ఊరట వస్తుందనే విశ్వాసం తమకు ఉందని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.