కృష్ణా పశ్చిమ డెల్టాకు రైతులకు సకాలంలో నీరివ్వడంలో విఫలం
4 లక్షల ఎకరాల మేర పంటలు ఎండిపోతున్నాయి
వ్యవసాయ రంగంపై వైసీపీ నిర్లక్ష్యానికి నిరసనగా టీడీపీతో కలిసి పోరాటం చేస్తాం
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో చేసుకున్న రూ.13 లక్షల కోట్ల ఒప్పందాలు ఏమయ్యాయి?
ఇన్ఫోసిస్ కార్యాలయం మీరే తీసుకొచ్చినట్లు బిల్డప్ ఎందుకు?
ఆ సంస్థ తమ ఉత్తరాంధ్ర ఉద్యోగుల సౌలభ్యం కోసం కార్యాలయం ఏర్పాటు చేసింది
గుంటూరు మీడియా సమావేశంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
గుంటూరు : రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే ప్రధాన కారణమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ముఖ్యమంత్రి అమరావతి నుంచి కాకుండా విశాఖ నుంచి పాలనకు సిద్ధమైతే రాజధాని పేరుతో ఈ ప్రాంత ప్రజలను మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నరేళ్లలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కుదేలయ్యాయని, హాఫ్ నాలెడ్జ్ ముఖ్యమంత్రితో రాష్ట్ర ప్రజలకు అపార నష్టం వాటిల్లిందని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో రైతాంగం చితికిపోయిందని, వారికి అండగా నిలబడటం కోసం తెలుగుదేశం పార్టీతో కలిసి పోరాటం చేస్తామని అన్నారు. గుంటూరు జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “వైసీపీ నాయకుల అనాలోచిత నిర్ణయాలు వల్ల రాష్ట్రంలో ఎక్కువ మంది ఉపాధి పొందుతున్న వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగం అధ:పాతాళానికి పడిపోయింది. కృష్ణా పశ్చిమ డెల్టాలో దాదాపు 4 లక్షల ఎకరాలకు సకాలంలో నీరందక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారు. పులిచింతల, పట్టిసీమ నీరును ఉపయోగించుకోలేకపోతున్నారు. నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రికి పట్టుంటే సరైన ప్రణాళికలతో రైతులకు న్యాయం చేసేవారు. ఆయనకు శాఖపై పట్టు లేకపోవడంతో రైతులు రోడ్డునపడ్డారు. వ్యవసాయ కూలీలు ఉపాధి కోల్పోయారన్నారు.
కోడి గుడ్డు మంత్రికి ఇన్ఫోసిస్ తో సంబంధం ఏమిటి? : విశాఖలో ఇన్ఫోసిస్ కార్యాలయం ప్రారంభం అయితే ప్రభుత్వ ఎందుకు హడావుడి చేస్తోంది? ముఖ్యమంత్రి, కోడి గుడ్డు మంత్రికి ఇన్ఫోసిస్ కార్యాలయంతో సంబంధం ఏంటి? ఉత్తరాంధ్రలో ఉన్న ఇన్ఫోసిస్ ఉద్యోగులు వారంలో రెండు రోజులైనా ఆఫీసుకు వచ్చి పని చేసుకునేందుకు వీలుగా ఇన్ఫోసిస్ కార్యాలయం నిర్మాణం చేసింది. 250 నుంచి 300 మంది వరకు వచ్చి పని చేసుకునేలా కార్యాలయం నిర్మించింది. అదేదో ముఖ్యమంత్రి చొరవ వల్ల ఇన్ఫోసిస్ రాష్ట్రానికి వచ్చినట్లు వైసీపీ నాయకులు బిల్డప్ ఇస్తున్నారు. ఇన్ఫోసిస్ సంస్థ ఉత్తరాంధ్రకు చెందిన తమ ఉద్యోగుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన కార్యాలయం అది. దీనికి సీఎం హడావిడి చేస్తున్నారన్నారు.
ఐటీ టవర్స్ లో 2.5 లక్షల చ.అడుగులు ఖాళీ : మీలో నిజంగా నిజాయతీ ఉంటే విశాఖ ఐటీ టవర్స్ లో రెండున్నర లక్షల చదరపు అడుగులు ఎందుకు ఖాళీగా ఉంటుంది. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఏర్పాటు చేసి రూ.13 లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నామని వైసీపీ నాయకులు చెప్పారు. అందులో ఏ ఒక్క కంపెనీని తీసుకొచ్చి ఈ రోజు ప్రారంభించినా హర్షించేవాళ్లం. అది చేయకుండా ఇన్ఫోసిస్ మీరే తీసుకొచ్చినట్లు ఇంత తతంగం ఎందుకు? వైసీపీ నాయకులకు సరైన ప్రణాళిక లేకపోవడం, విద్యుత్ ఛార్జీలు ఇష్టమొచ్చినట్లు పెంచడంతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయి. వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు.
ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం : వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టులు, పంట కాలువలకు కనీస మరమ్మతులకు నిధులు ఇవ్వలేదు. రైతులు వేడుకుంటున్నా పంట కాలువల పూడికలు తీయించలేదు. దీంతో చివరి ఆయకట్టుకు నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయిల్ ఇంజన్లు, పైపులు వేసుకొని నీళ్లు తోడుకుంటున్నారు. వ్యవసాయ రంగంపై వైసీపీ నిర్లక్ష్యానికి నిరసనగా తెలుగుదేశం పార్టీతో కలిసి భారీ ఎత్తున పోరాటం చేస్తాం. ప్రభుత్వం దిగి వచ్చి రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, గుంటూరు నగర అధ్యక్షులు నేరెళ్ళ సురేష్, రాష్ట్ర కార్యదర్శి వడ్రాణమ్ మార్కండేయబాబు, వీరమహిళ నేత బి.పార్వతి నాయుడు తదితరులు పాల్గొన్నారు.