తిరుమల : రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తిరుమల పర్యటనలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు సోమవారం చిన్నశేషవాహన సేవలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి తో కలిసి పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు ఉదయం మలయప్పస్వామి వారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ఆలయ మాడ వీధులలో జరిగిన ఊరేగింపు లో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం, తెలంగాణ పర్యాటక శాఖ ద్వారా తిరుమలకు వచ్చే భక్తుల శీఘ్ర దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి రోజు విడుదల చేస్తున్న 300 భక్తుల శీఘ్ర దర్శనం టికెట్ల కోటాను 500 శీఘ్ర దర్శనం టికెట్లకు పెంచాలని రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు. అలాగే, తెలంగాణ పర్యాటక శాఖ ద్వారా తిరుమలలోని శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌలభ్యం కోసం కొండపైన భక్తుల కోసం స్థలాన్ని, ప్రత్యేక వసతి గదులను కేటాయించాలని ఈ వినతి పత్రంలో పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ చేసిన విజ్ఞప్తి పై టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో టూరిజం ఓ ఎస్ డీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.