న్యూఢిల్లీ : అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆ పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న చంద్రబాబు ఆరోగ్యంపై నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో ఈ లేఖ రాస్తున్నట్లు కనకమేడల పేర్కొన్నారు. ‘‘చర్మ సంబంధిత అలర్జీలతో చంద్రబాబు బాధపడుతున్నారని నివేదికలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ ప్రతీకార చర్యలు, రిమాండ్లో ఉన్న చంద్రబాబు పట్ల వ్యవహరిస్తున్న తీరు తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. చంద్రబాబు ఆరోగ్యం దెబ్బతినే విధంగా జైలు పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. ఆయన ఇప్పటికే 5 కిలోల బరువు తగ్గినట్లు తెలిసింది. గణనీయంగా బరువు తగ్గినట్లు రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఆయన కిడ్నీలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వం చంద్రబాబుకు స్టెరాయిడ్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇలాంటి చర్యల వెనుక ప్రభుత్వ ఆలోచనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన నివేదికల ప్రకారం చంద్రబాబుకు తక్షణమే వైద్య సహాయం అవసరం అని సూచిస్తున్నాయి. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకుని చంద్రబాబుకు మెరుగైన వైద్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రధానికి రాసిన లేఖలో కనకమేడల పేర్కొన్నారు.