ప్రతి వారం క్రమం తప్పకుండా దగ్గర సమీక్షలు చేయాలి
ప్రకాశం జిల్లాలో కూడా కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటుకు చర్యలు
ప్రతి ఒక్కరి ఫోన్లో కూడా ఆరోగ్య శ్రీ యాప్‌ని డౌన్లోడ్ చేయాలి
వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష
గుంటూరు : వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో జగనన్న ఆరోగ్య సురక్ష సహా పలు అంశాలపై సంబంధిత అధికారులతో వైఎస్ జగన్ చర్చించారు. ఈ సందర్భంగా జగనన్న ఆరోగ్య సురక్షపై వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటి వరకూ 1,22,69,512 కుటుంబాలపై సర్వే చేసినట్టు అధికారులు తెలిపారు. సీఎం జగన్ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో రోగులు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందాలని తెలిపారు. పేషెంట్లకు అందుతున్న సదుపాయాలు మెరుగ్గా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హెల్త్ క్యాంపులను నిర్వహించడమే కాదు, వారి ఆరోగ్యం బాగు అయ్యేంతవరకూ చేయిపట్టుకుని నడిపించాలని సీఎం జగన్ పేర్కొన్నారు. చికిత్స అనంతరం వాడాల్సిన మందుల విషయంలో అవి ఖరీదైనా సరే వారికి అందించాలన్నారు. ప్రతీ నెలకు మండలంలో నాలుగు సచివాలయాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని తెలిపారు. రోగుల సంతృప్తి, క్యాంపుల్లో సదుపాయాలు, రోగులకు చేయూత నందించడం, ఆరోగ్య సురక్ష కార్యక్రమంమీద అవగాహన ఈ నాలుగు అంశాలమీద తప్పనిసరిగా సమీక్ష చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆరోగ్య సురక్ష మీద ప్రతి వారం క్రమం తప్పకుండా దగ్గర సమీక్షలు చేయాలని, ప్రతి ఒక్కరి ఫోన్లో కూడా ఆరోగ్య శ్రీ యాప్‌ని డౌన్లోడ్ చేయాలన్నారు. దీని వల్ల పర్యవేక్షణ మరింత సులభతరం అవుతుంది. అలాగే దివ్యాంగులకు సర్టిఫికెట్లు ఇవ్వడంలోనూ మార్పులు రావాలని, నిపుణులైన వైద్యులు ఆరోగ్య సురక్షా శిబిరాలకు వస్తున్నప్పుడు అక్కడే వీరికి సర్టిఫికెట్లు జారీచేయాలన్నారు. తిరుపతి తరహాలోనే చిన్న పిల్లల కోసం అత్యాధునిక ఆస్పత్రిని విజయవాడ–గుంటూరు, విశాఖపట్నంలో ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రకాశం జిల్లాలో కూడా కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆస్పత్రుల్లో నాడు – నేడు : కొత్త మెడికల్‌కాలేజీల నిర్మాణ ప్రగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణ పనుల్లో పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. అర్భన్ హెల్త్ క్లినిక్కుల నిర్మాణ పనులను కూడా నిర్దేశించుకున్న లక్ష్యంలోగా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ (ఎఫ్ఏసీ) అజయ్ జైన్, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి (కోవిడ్ 19) మంజుల డి హోస్మణి, ఆరోగ్య, కుటుంబసంక్షేమశాఖ డైరెక్టర్ జె నివాస్, ఎపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్, ఆరోగ్యశ్రీ సీఈఓ హరేంధిర ప్రసాద్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ డిఎస్విఎల్ నరసింహం, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రామిరెడ్డి, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ బి చంద్రశేఖరరెడ్డి, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ సాంబశివారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరు కాగా వీసీ ద్వారా సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎం టి కృష్ణబాబు పాల్గొన్నారు.