విశాఖలో సైబర్ క్రైమ్ నాలుగో ప్రాంతీయ సదస్సు
విశాఖపట్నం : పోలీసులతోపాటు దర్యాప్తు సంస్థలకు అతిపెద్ద సవాల్‌గా మారిన సైబర్ నేరాలకు రాష్ట్రాల మధ్య సమన్వయం ఉన్నప్పుడే అడ్డుకట్ట వేయగలమని కేంద్ర హోంశాఖ(అంతర్గత భద్రత) ప్రత్యేక కార్యదర్శి శివగామి సుందరీనందా అన్నారు. భారత సైబర్‌క్రైమ్ సమన్వయ కేంద్రం, కేంద్రహోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ సమన్వయ బృందం నాలుగో ప్రాంతీయ సదస్సును విశాఖలోని ఓ హోటల్లో నిర్వహించారు. ఏపీ, కేరళ, తమిళనాడు, ఒడిసా, జార్ఖండ్ రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన లక్షద్వీప్, పుదుచ్చేరి, అండమాన్ నికోబర్ దీవుల డీజీపీ స్థాయి అధికారులు సహా పలు శాఖల అధికారులు 50 మంది వరకూ ఈ సదస్సులో పాల్గొన్నారు. ఏపీ డీజీపీ కె.రాజేంద్రనాథ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సులో సుందరీనందా మాట్లాడుతూ సైబర్ నేరాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు, వాటిపై అవగాహన పెంచేందుకు వీలుగా అన్నిరాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను 8 బృందాలుగా విభజించామన్నారు. సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు అడిగిన ప్రశ్నలు, లేవనెత్తిన సందేహాలను సమన్వయ కేంద్రం ప్రతినిధులు నివృత్తి చేశారు. సైబర్ నేరాల్లో ఇతర దేశాల సహాయ సహకారాలతో నిందితులను పట్టుకోవడం గురించి నిపుణులు వివరించారు.