కొద్ది రోజుల్లో రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ లకు అక్రిడేషన్ లభించేలా కార్యాచరణ
పాలిటెక్నిక్ విద్యను అంతర్జాతీయ స్దాయి ప్రమాణాల మేరకు నిర్వహించాలన్న ప్రభుత్వ లక్ష్యం సాకారమవుతోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ లకు నేషనల్ బోర్డ్ ఆప్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) సాధించాలన్న సాంకేతిక విద్యా శాఖ ప్రయత్నాలు సత్ ఫలితాలను ఇస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలోని తొమ్మిది ప్రభుత్వ పాలిటెక్నిక్ లు ఎన్బీఏ గుర్తింపు పొందగా, ఈ విద్యా సంవత్సరం చివరినాటికి అన్ని పాలిటెక్నిక్ లు ఆదిశగా విజయం సాధించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాయి. మొత్తం 16 ప్రోగ్రామ్‌లలో తొమ్మిది పాలిటెక్నిక్ లు ఇప్పటి వరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ నుండి గుర్తింపును పొందాయని సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి ఒక్క ప్రభుత్వ పాలిటెక్నిక్ ను ఉన్నత స్ధాయి ప్రమాణాల మేరకు తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
తొలిదశలో 41 ప్రభుత్వ పాలిటెక్నిక్ లకు ఎన్ బిఎ కోసం ప్రయత్నించగా, మిగిలిన 32 పాలిటెక్నిక్ లు కూడా ఎన్బీఏ గుర్తింపు పొందేందుకు సిద్దంగా ఉన్నాయి. వీటిలో ఐదు పాలిటెక్నిక్‌లు అన్ని రకాల తనిఖీలను పూర్తి చేసుకుని గుర్తింపు ఫలితాల ప్రకటన కోసం ఎదురుచూస్తున్నాయి. మరో ఐదు పాలిటెక్నిక్‌లను తనిఖీ చేసేందుకు ఎన్బీఏ యంత్రాంగం అక్టోబర్ చివరి వారంలో తేదీలను కేటాయించింది. రాష్ట్రంలో మొత్తం 87 ప్రభుత్వ పాలిటెక్నిక్ లు ఉండగా మిగిలిన 46 పాలిటెక్నిక్ లలో 43 సంస్ధలకు వచ్చే విద్యా సంవత్సరంలో గుర్తింపు వచ్చేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు. నూతనంగా మూడు పాలిటెక్నిక్ లు ప్రారంభించగా వీటికి మూడు సంవత్సరాల తరువాత ధరఖాస్తు చేయవలసి ఉంది. వృత్తిపరమైన విద్యా రంగంలో నాణ్యత, ఔచిత్యానికి హామీ ఇచ్చి, అత్యున్నత స్థాయి విశ్వసనీయతను నిర్ధారించడం ధ్యేయంగా అంతర్జాతీయ ప్రమాణాల అక్రిడిటింగ్ ఏజెన్సీగా భారత్ లో ఎన్బీఏ వ్యవహరిస్తోంది. ఉన్నత విద్యా వ్యవస్థలో బోధన, స్వీయ-మూల్యాంకనం, జవాబుదారీతనం, నాణ్యతా ప్రణామాల పెంపు, నిపుణులను తయారి వంటి అంశాలను ఎన్బీఏ పరిశీలిస్తుంది.
నిజానికి ఎన్బీఏ గుర్తింపు విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వ పాలిటెక్నిక్ లు వెనకబడి ఉన్నాయి. ఈ లోటును గుర్తించిన సాంకేతిక విద్యా శాఖ ఆ ప్రమాణాలకు అనుగుణంగా పాలిటెక్నిక్ లను తీర్చి దిద్దటంలో విశేష కృషి చేసింది. అక్రిడిటేషన్ ఆవశ్యకతను గుర్తిస్తూ అయా సంస్ధలలో విప్లవాత్మకమైన మార్పులకు సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ నాగరాణి శ్రీకారం చుట్టారు. నిరంతర సమీక్షలు, అయా పాలిటెక్నకి ల సందర్శనల ద్వారా అన్ని అంశాలు సృజనాత్మకంగా, సమగ్రంగా సిద్ధం చేసుకునేలా ప్రోత్సహించారు. లైవ్ ప్రాజెక్ట్‌ల ప్రదర్శన ద్వారా విద్యార్థుల విజయాలను ప్రతిబింబిప చేసారు. ఫలితంగా శ్రీకాకుళం, విజయవాడ, కుప్పం, అనకాపల్లి, గన్నవరం, కళ్యాణ దుర్గం , అముదాల వలస, కాకినాడ, గుంటూరు పాలిటెక్నిక్ లు ఎన్బీఏ గుర్తింపును దక్కించుకున్నాయి. ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, నైపుణ్యాభివృద్ది శాఖ కార్యదర్శి సురేష్ సైతం ఎన్బీఏ గుర్తింపు విషయంలో నిరంతరం సమీక్షలు చేస్తూ మార్గదర్శకత్వం అందించారు.
కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాలిటెక్నిక్ లు: నేషనల్ బోర్డు ఆప్ అక్రిడిటేషన్ గుర్తింపు సాధనలో భాగంగా చేస్తున్న కార్యక్రమాలు ప్రభుత్వ పాలిటెక్నిక్ లకు నూతనత్వాన్ని ఆపాదిస్తున్నాయి. కళాశాలలోని అన్ని విభాగాలు ఆధునికతను సంతరించుకుంటున్నాయి. పరిసరాల పరిశుభ్రతతో మొదలు భవనాలకు రంగులు వేయటం, ప్రయోగశాలల ఆధునీకరణ, విద్యార్ధులకు వసతుల మెరుగు, సిబ్బంది రేషనలైజేషన్ ఇలా నాడు నేడు తరహాలో మార్పులు ఆస్కారం ఏర్పడింది. విద్యార్ధులు వసతి గృహాలు సైతం మెరుగు పడ్డాయి. ఫలితంగా ఒక కొత్త ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యా వ్యవస్ధ నడిచేందుకు అవసరమైన మార్గం ఏర్పడింది.