వార్షిక ఆదాయం రూ. 8 లక్షలకు మించరాదు
మాగాణి 10, మెట్ట 25 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదంటూ ఉత్తర్వులు
అమరావతి : జగనన్న సివిల్ సర్వీసెస్ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గత ప్రభుత్వం అమలు చేసిన సివిల్స్ ఉచిత శిక్షణ పథకానికి నాలుగున్నరేళ్లపాటు తిలోదకాలిచ్చిన ప్రభుత్వం ఎన్నికల ముందు ఈ పథకాన్ని తీసుకొస్తూ అమలులో మాత్రం షరతులు పెట్టింది. కుటుంబంలో ప్రభుత్వ పింఛనుదారు ఉన్నా పథకాన్ని వర్తింపచేయబోమని స్పష్టం చేసింది. ఇదొక్కటే కాదు కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకుని పలు నిబంధనలు విధించింది. యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయిన వారికి రూ.లక్ష, మెయిన్స్‌లో క్వాలిఫై అయిన వారికి రూ. 50 వేలు ఆర్థిక సాయాన్ని అందించనున్నట్టు పేర్కొంది. యూపీఎస్సీ మార్గదర్శకాల ప్రకారం ఒక అభ్యర్థి ఈ పరీక్ష రాయడానికి ఎన్నిసార్లు అవకాశం ఉంటే అన్ని విడతలకూ సాయాన్ని వర్తింప చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
అర్హత నిబంధనలివి
దరఖాస్తుదారు సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బలహీనవర్గానికి/వెనుకబడిన తరగతులకు చెంది ఉండాలి. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్‌లో నివాసితుడై ఉండాలి.
కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి రూ.8 లక్షలకు మించరాదు. మాగాణి 10 ఎకరాల కంటే లేదా మెట్ట 25 ఎకరాల కంటే తక్కువే ఉండాలి. లేదా రెండూ కలిపి 25 ఎకరాలకు మించకూడదు. దీనికి కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు.
పట్టణ ప్రాంతాల్లో నివాస/వాణిజ్య స్థలం 1500 చ.అడుగులు విస్తీర్ణం కంటే ఎక్కువగా ఉండకూడదు.
కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు/పింఛనుదారులు ఉండరాదు. పారిశుద్ధ్య కార్మికులు అర్హులే.
నాలుగు చక్రాల వాహనం ఉండరాదు. ఆటో/ట్యాక్సీ/ట్రాక్టర్లకు మినహాయింపు.
యూపీఎస్సీ ఫలితాలు వెల్లడించిన 15 రోజుల్లోగా దరఖాస్తుల స్వీకరణ పూర్తి.