నవరత్నాల్లోని ప్రతీ పథకాన్ని బాధ్యతతో అమలు చేస్తున్నాం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
సామర్లకోట : రాష్ట్రంలో 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించామని, రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17వేల జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయని, కడుతున్నవి ఇళ్లు కాదు..ఊళ్లు అన్నారు. రాష్ట్రంలో 7.43 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని, రాష్ట్రవ్యాప్తంగా మరో 14.33లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. ప్రతీ పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తోందని, లక్షల విలువైన ఆస్తిని అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతున్నామని, రాష్ట్రంలో 87 శాతం ఇళ్లకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.75 లక్షలు ఖర్చు చేస్తున్నామని, మౌలిక వసతులను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందన్నారు. ఉచితంగా ఇసుక, తక్కువ ధరకే స్టీల్, సిమెంట్ అందిస్తున్నామని, వేల కోట్లు ఖర్చు చేసి ఇంటి కలను సాకారం చేస్తున్నామని, పేద అక్కచెల్లెమ్మలకు శాశ్వత చిరునామా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు.
పేదవాడికి చంద్రబాబు ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదని, తాను ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో కూడా పేదలకు బాబు సెంటు స్థలం ఇవ్వలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాకే కుప్పంలో కూడా 20 వేల ఇళ్ల పట్టాలిచ్చాం అన్నారు. సామర్లకోట లేఔట్లో వెయ్యికిపైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, నవరత్నాల్లోని ప్రతీ పథకాన్ని బాధ్యతతో అమలు చేస్తున్నామని, మన ప్రభుత్వంలో 35కు పైగా పథకాలు అమలవుతున్నాయన్నారు. పేదవాడి బతుకులు మార్చాలన్న తాపత్రయంలో ప్రభుత్వం పనిచేస్తోందని, గత ప్రభుత్వం ఏనాడూ పేదల మీద కనికరం చూపలేదన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా చంద్రబాబు కోర్టులకు వెళ్లారని, పేదలకు మంచి జరగకుండా అడుగడుగునా అడ్డుపడ్డారని విమర్శించారు.