ఆసియా క్రీడల్లో బంగారు పతకాలు సాధించిన జ్యోతిసురేఖ స్వదేశానికి చేరుకున్నారు. కోనేరు హంపితో కలిసి గన్నవరం విమానాశ్రయానికి ఆమె చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. చైనాలోని హాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడలు ఆర్చరీలో ఒకేసారి మూడు స్వర్ణాలు సాధించటం గర్వంగా ఉందని జ్యోతిసురేఖ తెలిపారు. చెస్‌లో రజతం సాధించడం ఆనందంగా ఉందని కోనేరు హంపి పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో చెస్ పోటీలు రెగ్యులర్‌గా జరిగేవి కావని.. 2006, 2010 తర్వాత మళ్లీ ఈ ఏడాదే జరిగాయని వెల్లడించారు. ఈసారి ఆసియా క్రీడల పట్టికలో భారత్ 107 పతకాలతో (28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు) నాలుగో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.