వరహా పుష్కరిణి అభివృద్ధికి నిధులు కేటాయించండి
ఈవోకు అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు వినతి
సింహచలం : సింహచలం శ్రీ వరాహా లక్ష్మీ నృసింహ స్వామి అనుబంధ దేవాలయాల అభివృద్ధికి ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేశారు. ఇటీవలే అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు కొండ దిగువున కొలువున్న అప్పన్న సోదరీమణలు పైడితల్లి, బంగారమ్మ అమ్మవార్ల ఆలయాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. చాలా కాలం క్రితమే ఇందుకు సంబంధించి అవసరమైన లేఖను అందజేశారు. దీంతో ఎట్టకేలకు బంగారమ్మ ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు రూ.35లక్షలు, పైడి తల్లి అమ్మవారి ఆలయంలో సదుపాయాలు కల్పించేందుకు మరో రూ.10లక్షలతో ప్రతిపాదనలు తయారు చేసి ధర్మకర్తల మండలికి పంపించారు. త్వరలో జరగనున్న ట్రస్టు బోర్డు సమావేశంలో సభ్యులు నిధులు మంజూరుకు ఆమోదం తెలియజేయగానే అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. సింహాచలం దేవస్థానం ఆలయ చరిత్రలో ఈ రెండు ఆలయాలు అత్యంత ప్రాచుర్యం పొందాయి.
వరహా పుష్కరిణిని అభివృద్ధి చేయండి : కొండ దిగువున ఉన్న వరాహా పుణ్య పుష్కరిణి ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని ఇందుకు సంబంధించి త్వరలోనే జరగనున్న ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించి నిధులు కేటాయించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు ఆలయ ఈవో ఎస్. శ్రీనివాసమూర్తిని కోరారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలతో కూడిన వినతిపత్రాన్ని బుధవారం ఆలయ ఈవోకు శ్రీనుబాబు అందజేశారు. ఆలయ చరిత్రలో వరాహా పుష్కరిణి అత్యంత ప్రాచుర్యం పొందిందని శ్రీనుబాబు ఈవోకి వివరించారు. అదే విధంగా అడవివరం స్మశాన వాటికకు వెళ్లే రహదారిని, అక్కడ ఉద్యానవనాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. గతంలో ఐదు కోట్లతో పుష్కరిణి అబివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసిన పనులు జరగలేదని ఈవోకి తెలిపారు. తాజాగా ప్రసాద్ స్కీమ్ పుష్కరిణి అభివృద్ధి కోసం ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు అవకాశం రాలేదన్నారు. వరాహా పుష్కరిణి ప్రాంగణంలో జీవీఎంసీ నిధులతో వాకింగ్ ట్రాక్, రహదారుల నిర్మాణానికి దేవస్థానం తరుపున లేఖ రాయాలని శ్రీనుబాబు ఈవోని కోరారు.