3 నుంచి 10 విద్యార్థులకు ఏ మాత్రం ఉపయోగపడని టోఫెల్ పరీక్ష
ఈటీఎస్ వెంటపడి మరి ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం
ఏటా రూ.1052 కోట్లకు ఎసరు..2027 వరకు పథకం ఎంఓయూ
ఇంటికి వెళ్లిపోయే వైసీపీ సర్కార్ హడావిడి ఒప్పందం
అంబేడ్కర్ పేరుతో ఉన్న విదేశీ విద్యా పథకాన్ని గాడి తప్పించారు
జగన్ పేరుతో విదేశీ పథకం తెచ్చి ఏం సాధించారు?
జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
ప్రతిపక్ష నేతలను విమర్శించడం కోసమే సీఎం పర్యటనలు
గుంటూరు : కేవలం ప్రతిపక్ష నేతలను విమర్శించడం కోసమే సీఎం పర్యటనలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం పేదలకు విదేశీ విద్య పేరిట దోపిడీకి తెర తీసిందని ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టోఫెల్ శిక్షణ పేరిట ఈటీఎస్ సంస్థకు ఏటా రూ.1040 కోట్లు దోచి పెట్టడానికి సిద్ధమైందన్నారు. ఏటా అమెరికా వీసా పొందే తెలుగు విద్యార్థులు 40 వేల మంది మాత్రమే అని, కానీ ప్రభుత్వం లక్షలాది మందికి శిక్షణ ఇచ్చేది ఎందుకని ప్రశ్నించారు. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద వైసీపీ ప్రభుత్వం కేవలం 340 మందిని మాత్రమే విదేశాలకు పంపించిందని తెలిపారు. నాలుగేళ్లుగా ప్రజల్ని మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు బస్సు యాత్ర ద్వారా మరోసారి మోసానికి సిద్ధమైందని మండిపడ్డారు. సీఎం హెలికాప్టర్లో తిరుగుతూ ఎస్సీ, ఎస్టీ , బీసి నేతలను బస్సుయాత్ర చేయాలని ఆదేశించారన్నారు. బస్సు యాత్రలో జగన్ రెడ్డి కూడా పాల్గొనాలని, రాష్ట్రంలో రోడ్ల దుస్థితి ప్రత్యక్షంగా చూడాలని మనోహర్ డిమాండ్ చేశారు.
*టోఫెల్ విద్యా పథకం పేరుతో మరోసారి ప్రజా ధనాన్ని కొల్లగొట్టి.. పన్నులు చెల్లించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు టోపీ పెట్టడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధమైంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, ఎన్నడూ చూడని విధంగా పేద పిల్లల పేరుతో వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించడానికి వైసీపీ రంగం సిద్ధం చేసుకుంది. పాఠశాల స్థాయిలో ఉన్న విద్యార్థులకు ఏ మాత్రం ఉపయోగపడని టోఫెల్ ను బలవంతంగా రుద్దుతూ ఆ ముసుగులో వేల కోట్ల రూపాయలను జేబులో వేసుకునేందుకు వైసీపీ నేతలు రెడీ అయ్యారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలిలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. “టోఫెల్ పరీక్ష అనేది డిగ్రీ పూర్తయిన విద్యార్థులు ఒక వేళ ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీల్లో చదువుకోవడానికి వెళ్లాలని భావిస్తేముఖ్యంగా అమెరికా వెళ్ళేవాళ్లు ముందుగా వారి ఇంగ్లీషు పరిజ్ఞానం తెలుసుకునేందుకు నిర్వహించే టెస్ట్. ఈ పరీక్షను ఈటీఎస్ అనే సంస్థ ద్వారా నిర్వహిస్తారు. జగన్ ప్రభుత్వం మాత్రం టోఫెల్ పరీక్షను మూడో తరగతి నుంచి పదవ తరగతి చదివే పిల్లలకు ఈ ఏడాది నుంచి 2027 వ సంవత్సరం చివరి వరకు ఈ పరీక్షను అన్ని తరగతుల వారీగా నిర్వహించేలా ఈటీఎస్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనికోసం ప్రతి ఏటా రూ.1052 కోట్లు ఖర్చు చేయనుంది. నాలుగు సంవత్సరాలకు కలిపి సుమారుగా రూ.4 వేల కోట్లకు పైబడి ఈ పథకంలో ఖర్చు చేయనున్నారు.
వచ్చే అయిదు నెలల్లో ఇంటికి వెళ్లబోయే ప్రభుత్వం, ఈటీఎస్ సంస్థ వెంటపడి మరి ఈ ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక వైసీపీ పెద్దల స్వలాభం దాగుంది. కచ్చితంగా ఈ ఒప్పందం ఎందుకు చేసుకుందో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
ఏ మాత్రం ఉపయోగం లేని పరీక్ష ఎందుకు? : టోఫెల్ పరీక్షను గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత విద్యార్థులు రాస్తారు. ఇది మూడవ తరగతి పిల్లలకు ఏ మాత్రం పనికిరాదు. అలాగే పదో తరగతి పిల్లలు ఈ పరీక్ష రాసి, ఉత్తీర్ణులు అయినా వారికీ ఉపయోగం లేదు. వారు డిగ్రీ పూర్తి అయ్యే సమయానికి టోఫెల్ పరీక్ష ఉత్తీర్ణతకు ఉండే రెండేళ్ల గడువు పూర్తవుతుంది. 2 అంటే ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, పొందే స్కోర్ రెండు సంవత్సరాలు మాత్రమే పరిగణనలో ఉంటుంది. మరి అలాంటప్పుడు పదో తరగతి విద్యార్థులకు సైతం ఈ పరీక్ష ఏ మాత్రం ఉపయోగపడదు. దీని కోసం రాష్ట్రంలోని 1,06,00,316 మంది పిల్లలను కావాలని ఇబ్బంది పెట్టడం ఎందుకు..? ప్రయోజనం లేని టోఫెల్ పరీక్షకు రూ.4 వేల కోట్ల ఖర్చు ఎందుకు..? అమెరికా దేశం ప్రతి ఏటా తమ దేశంలో చదువుకోవడానికి వచ్చేవారి కోసం నాలుగు లక్షల వీసాలను మాత్రమే ఇస్తోంది. దానిలో సుమారు 45 వేల వీసాలు రెండు తెలుగు రాష్ట్రాలకు వస్తున్నాయి. అమెరికా చదువుకోవడానికి అంత మందిని అనుమతించినప్పుడు టోఫెల్ పరీక్షలు విద్యార్థులకు ఎందుకు ఉపయోగపడతాయి..? రాష్ట్రంలో ప్రతి ఏటా 3.17 లక్షల మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్నారు. దీనిలో 1.20 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉంటారు. వీరంతా ఉన్నత చదువులు కోసం విదేశాలకు వెళ్లరు. ఒక వేళ వెళ్ళాలి అనుకున్న వారికి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న టోఫెల్ పథకం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. మరి ఎందుకు ఈ పథకం అంత ఖర్చుపెట్టి అమలు చేస్తున్నారు అన్నది సందేహాస్పదంగా ఉంది. పోనీ ఇంగ్లీష్ విద్యలో చిన్నారులకు ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే అది కనిపించడం లేదన్నారు.
ఉన్నది..12 వందల మంది ఇంగ్లీష్ టీచర్స్ మాత్రమే : రాష్ట్రంలో ఉన్న 1.81 లక్షల ఉపాధ్యాయుల్లో కేవలం 1200 మంది మాత్రమే ఇంగ్లీష్ ఉపాధ్యాయులు ఉన్నారు. మరి వారు ఈ పథకంలో పిల్లలకు ఎలా ఉపయోగపడతారు? ఇంగ్లీషు రాని ఉపాధ్యాయులు పరీక్షకు పిల్లలను ఎలా సమాయత్తం చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇలాంటి విచిత్రమైన ఆలోచన నాకు తెలిసి ప్రపంచంలో ఏ ప్రభుత్వ అధినేతకీ వచ్చి ఉండదు. పేద పిల్లల పేరు చెప్పి వేలకోట్ల రూపాయలను పక్కదారి పట్టించడానికి ఈ పన్నాగం అని తెలుస్తోంది. ఒక రోజు సీబీఎస్సీ సిలబస్ అంటూ, మరో రోజు ఐబీ సిలబస్ అంటూ ఇంకో రోజు టోఫెల్ అంటూ విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని, వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు.