గుంటూరు : రాష్ట్ర ప్రభుత్వానికి సాగునీటి పంపిణీ విషయంలో కనీస ప్రణాళిక లేదని టీడీపీ మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నీటి పారుదల శాఖ మంత్రికి బూతులు మాట్లాడటం తప్ప సాగు నీరు గురించి తెలియదన్నారు. కృష్ణా డెల్టా పరిధిలో కనీసం సాగునీటి కాలువల మరమ్మతులు చేయలేదన్నారు. ఖరీఫ్ సీజన్ ముందే కాలువలు బాగు చేయాలన్న ఆలోచన లేదని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలు గడప గడపకు కార్యక్రమం తిరుగుతున్నారు కానీ రైతులకు నీరు ఇవ్వాలనే తలంపు లేదన్నారు. చంద్రబాబు ముందుచూపుతో పట్టిసీమ నిర్మించి కృష్ణా డెల్టాకు నీరు ఇచ్చారని తెలిపారు. కానీ ఇప్పుడు పులిచింతల నీరు అయిపోయాక హడావుడి చేస్తున్నారన్నారు. కనీసం పట్టిసీమ పంపులు మరమ్మతులు కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంటే అధికారులు, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పటం లేదన్నారు. సీఎం జగన్ కృష్ణా జలాలపై హక్కులు పూర్తిగా వదిలేసేందుకు సిద్ధమయ్యారని విమర్శంచారు. తెలంగాణ ప్రభుత్వం బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు మార్చాలని కోరితే జగన్ మౌనంగా ఉన్నారన్నారు. సీఎం వైఖరితో రాష్ట్రంలో భవిష్యత్తులో దారుణమైన పరిస్థితి రాబోతోందని, వెంటనే ప్రభుత్వం నిద్ర లేచి డెల్టా ఆయకట్టుకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల్లోనీరు ఇవ్వకపోతే ఉద్యమం చేస్తామని నక్కా ఆనందబాబు హెచ్చరించారు.