చంద్రబాబు అరెస్ట్ తర్వాత వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు
శుభవార్తతోనే ఏపీకి పురంధేశ్వరి వస్తారా!?
ఎన్డీఏతో పొత్తు, పోటీ స్థానాలపై తేల్చేసిన పవన్
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికలు రేపో, మాపో అన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. చంద్ర బాబు నాయుడు తో రాజమండ్రి సెంట్రల్ జైలులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ములాఖత్ కావడం, బయటికి వచ్చీ రాగానే టీడీపీతో కలిసి పొత్తుకు వెళ్తున్నట్లు ప్రకటించడంతో మరింత హాట్ టాపిక్ అయ్యింది. అదే మీడియా సమావేశం వేదికగా బీజేపీ కూడా కలిసి వస్తే బాగుంటుందని, మూడు పార్టీలను ఒక్కటి చేసేలా ఢిల్లీలోని కమలనాథులతో కూడా మాట్లాడుతానని పవన్ చెప్పుకొచ్చారు. అంతే కాదు ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలకుండా ఎదుర్కొంటామని కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దీంతో నాటి నుంచి నేటి వరకూ టీడీపీ-జనసేన రెండు పార్టీలు కలిసి కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ మధ్యనే సమన్వయ కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు.
అడుగులు ఎటు వైపో : పొత్తులో భాగంగా టీడీపీ-జనసేన కార్యక్రమాలు చురుగ్గా సాగిస్తుండటంతో ఇటు రాష్ట్రంలోని, అటు కేంద్రంలోని కమలనాథులు ఆలోచనలో పడ్డారు. దీంతో ఆ రెండు పార్టీలతో కలిసి ముందుకెళ్లాలా.? లేకుంటే ఒంటరిగానే పోటీచేయాలా.? అసలు పవన్ ప్రకటనలను ఎలా తీసుకోవాలనే విషయాలపై ఇప్పటికే విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కోర్ కమిటీ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశం జరిగిన రోజుల వ్యవధిలోనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో హుటాహుటిన ఆమె హస్తినకు వెళ్లారు. పొత్తుల విషయం తేల్చడానికే ఢిల్లీ పెద్దలు పిలిపించారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఒంటరిపోరా.? లేకుంటే టీడీపీ-జనసేనతో కలిసి ముందుకెళ్లాలా.? అనేది పురంధేశ్వరి పర్యటనతో తేలిపోతుందట. ఆదివారం సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆమె భేటీ అయ్యారు. పొత్తుతో పాటు ఏపీకి సంబంధించిన పలు కీలక విషయాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. సోమవారం నాడు బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డాతో కూడా పురంధేశ్వరి భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏం జరుగుతుందో? : మొత్తానికి చూస్తే ఈ పర్యటనతో పొత్తుపై ఫుల్ క్లారిటీ వచ్చేయనుందని ఏపీ బీజేపీ శ్రేణులు కూడా చెప్పుకుంటున్నాయి. సోము వీర్రాజు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో టీడీపీతో కలిసి నడిచేందుకు ఇష్టం లేదని, వస్తే జనసేనతో కలిసి లేకుంటే ఒంటరిపోరేనని పలుమార్లు చెప్పుకొచ్చారు. అది అప్పడున్న పరిస్థితుల్లో ఆయన అన్నప్పటికీ ఇప్పుడు పూర్తిగా సీన్ మారిపోయింది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్లో చంద్రబాబు అరెస్ట్‌పై ప్రస్తావన రావడం, ఈ అరెస్ట్ వెనుక కేంద్ర హస్తం ఉందనే వార్తలతో అమిత్ షా ఆందోళన చెందడం ఇవన్నీ చూస్తుంటే సైకిల్‌తో కలిసే కమలం అడుగులు ముందుకేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పురంధేశ్వరి ఇటు ఏపీకి రాగానే పవన్ కూడా ఢిల్లీ పర్యటనకు వెళతారని పెద్దలతో పొత్తులపై మాట్లాడి ఒప్పిస్తారనే చర్చ సైతం నడుస్తోంది. ఢిల్లీ నుంచి అధ్యక్షురాలు ఏం శుభవార్త పుట్టుకొస్తారో, కమలనాథులు ఏం చెప్పి పంపుతారో చూడాలి మరి.
ఎన్డీఏతో పొత్తు, పోటీ స్థానాలపై తేల్చేసిన పవన్ : టీడీపీతో జనసేన పొత్తు ప్రకటించిన తర్వాత ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎన్డీఏతో ఉన్నారా.? తెగదెంపులు చేసుకున్నారా.? పోనీ టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయా.? ఎక్కడ చూసినా ఈ ప్రశ్నలే మెదులుతున్నాయి. మరోవైపు సొంత పార్టీ కార్యకర్తలు, నేతలు కూడా కొందరు ఈ పొత్తు, ఎన్డీఏ కూటమిపై డైలామాలో ఉండటంతో ఎట్టకేలకు సేనాని స్పందించారు. పొత్తులు, సమన్వయ కమిటీలపై : ‘మేం (జనసేన) ఎన్డీఏలో ఉన్నాము. ఆ రోజు కూటమి సమావేశానికి కూడా హాజరయ్యాం. రాష్ట్ర విభజన వల్ల ఏపీ బాగా నష్టపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ కూడా చెప్పారు. 2014 తరహాలోనే 2024 ఎన్నికలలో పొత్తులు ఉండాలనేది నా ఆకాంక్ష. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనేది నా అభిప్రాయం. జీ-20 సమ్మిట్ జరుగుతున్నప్పుడు చంద్రబాబుపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆయన అరెస్టు విషయం తెలియక ముందే నేను బయలుదేరగా దారిలో ఉండగా విషయం తెలిసింది. అయినా నేను విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు. రోడ్లపై నిలబెట్టేశారు. మోడీ జీ-20 సదస్సుతో చాలా బిజీగా ఉన్నారు. చంద్రబాబును రాజమండ్రి జైలులో కలిసి మద్దతు ఇచ్చాను. కొన్ని పరిణామాల నేపథ్యంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాం. అయితే కేంద్ర పెద్దలతో సంప్రదించకుండా పొత్తు ప్రకటించాను. ఇప్పటికీ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనేది నా అభిమతం. మాతో పాటు బీజేపీ కూడా కలిసి వస్తుందని ఇప్పటికీ భావిస్తున్నాం. గతంలోనే జనసేన, బీజేపీ సమన్వయం కోసం కమిటీలు ఉన్నాయి. కొన్ని అంశాలలో ఇరు పార్టీల నేతలు కలిసి కార్యక్రమాలు నిర్వహించారు. ఇదే విధంగా ఇప్పుడు టీడీపీ, జనసేనలను సమన్వయం చేసేలా కమిటీ వేశాం. మహేందర్ రెడ్డి, దుర్గేష్, కొడికలపూడి గోవింద్, యశస్విని, నాయకర్లు సభ్యులుగా నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో ఈ కమిటీ పని చేస్తుందని పొత్తులు, సమన్వయ కమిటీల గురించి పవన్ ప్రకటించారు. దీంతో పొత్తుల పై మరి కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు
.