ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టు వాస్తవాలు-జగన్ ముఠా అబద్ధపు ఆరోపణలు’ పేరిట పుస్తకం విడుదల
చంద్రబాబుకు అవినీతి మరక అంటే అవకాశమే లేదు : పయ్యావుల కేశవ్
గుంటూరు : ప్రజలకు మేలు చేసిన ప్రాజెక్టుపై నిందలు వేయడం రాజకీయ కుట్ర కాదా? అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. నెలకు రూ.149కే ఇంటికి ఇంటర్నెట్, ఫోన్, టీవీ ఛానెళ్ల సౌకర్యం కల్పించాం. ఏపీ ఫైబర్నెట్ విధానాన్ని అనుసరించాలని ఇతర రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. రూ.కోట్ల ఖర్చు కళ్లముందే కనిపిస్తుంటే ఆరోపణలు చేస్తారా? జగన్ ముఠా చేసేది రాజకీయ కుట్ర కాక మరేమిటని ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ‘ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టు వాస్తవాలు-జగన్ ముఠా అబద్ధపు ఆరోపణలు’ పేరిట పుస్తకాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, కేశవ్ తదితరులు విడుదల చేశారు.
ఫైబర్ నెట్ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని సీఎం జగన్తో పాటు అందరికీ తెలుసని టీడీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ రాష్ట్రాన్ని జగన్ అన్ని రంగాల్లో భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలు తెలిస్తే ఏం జరుగుతుందోనని భయం ఆయనకు పట్టుకుందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. కొత్త పరిశ్రమలు కాదు. ఉన్న పరిశ్రమలే ఇతర రాష్ట్రాలకు తరలిపోయే పరిస్థితి నెలకొంది. చంద్రబాబుకు అవినీతి మరక అంటే అవకాశమే లేదు. ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని అందరికీ తెలుసు. దాదాపు 30 రోజులైంది. పైసా కూడా అవినీతి జరిగినట్లు నిరూపించలేకపోయారు. కేవలం రాజకీయ కక్ష, దురాలోచనతోనే కుట్ర పన్నారు. రూ.5వేల కోట్ల ప్రాజెక్టును రూ.330కోట్లకు తగ్గించాము. రూ.328కోట్లకే టెండరు వస్తే అవినీతి జరిగిందంటారా? ప్రజల నుంచి చంద్రబాబుకు వచ్చిన స్పందన చూసి ఓర్వలేకపోయారని పయ్యావుల కేశవ్ అన్నారు.