ఉత్తరాంధ్రాలో హోరెత్తనున్న రాజధాని నినాదం
విశాఖపట్నం : విశాఖ రాజధాని అవుతుంది. ఇది కచ్చితంగా జరుగుతుంది. జరిగి తీరాలి. విశాఖ రాజధానిగా ఉంటే వెనకబడిన ఉత్తరాంధ్రా ప్రాంతాలు అన్నీ కూడా అభివృద్ధి పధంలో పయనిస్తాయని పాలనా వికేంద్రీకరణ జేఏసీ అంటోంది. విశాఖకు వందనం పేరుతో శనివారం నుంచి ఉత్తరాంధ్రా అంతటా మారుమూల గ్రామాలలో ప్రచార రధం ద్వారా విశాఖ రాజధాని ఆవశ్యకతను తెలియ చేసేందుకు బృహత్తర కార్యక్రమం మొదలైంది. ఈ విజయదశమి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖకు మకాం మార్చనున్నారు. విశాఖ నుంచే ఆయన సీఎం క్యాంప్ ఆఫీసు ద్వారా పాలన సాగించనున్నారు. దాంతో విశాఖకు పాలనా రాజధాని తొందరలోనే వస్తుందని రావాలని ఆశిస్తూ వికేంద్రీకరణ జేఏసీ ప్రచార రధంతో పర్యటిస్తోంది.జగన్ పరిపాలన విశాఖ నుంచి సజావుగా సాగాలని జేఏసీ నేతలు ఆకాక్షించారు. ఉత్తరాంధ్ర లోని సుప్రసిద్ధ పుణ్య క్షేత్రాలను ఈ ప్రచార రధం సందర్శిస్తుంది. అదే విధంగా విశాఖకు రాజధాని అన్నది తొందరగా ప్రకటించాలని దేవీ దేవతలను కోరనున్నారు. విశాఖ సహా ఉత్తరాంధ్రా వెనుకబాటు తనానికి సరైన మందు జగన్ విశాఖ నుంచి పాలించడం అని జేఏసీ నేతలు అంటున్నారు వెల్ కం టూ జగన్ జై ఉత్తరాంధ్రా, విశాఖ రాజధాని రావాలి అంటూ నినదిస్తున్నారు. విశాఖతో పాటు ఉత్తరాంధ్రా జిల్లాలు వెనకబడిన ప్రాంతాలు అంటే జగన్ కి మక్కువ ఎక్కువని అందుకే ఆయన పాలనా వికేంద్రీకరణ కోరుకున్నారని విశాఖ మేయర్ హరి వెంకటకుమారి అన్నారు. జగన్ పాలనలో వెనకబడిన ప్రాంతాలు కచ్చితంగా అభివృద్ధి చెందుతాయని ఆమె అంటున్నారు. విశాఖకు వందనం పేరుతో రానున్న రోజులలో ఉత్తరాంధ్రాలో రాజధాని నినాదం హోరెత్తనుంది.