విజయవాడ : ఉద్యోగుల సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ రూపకల్పన చేసిందని,
జీపీఎస్ ద్వారా ఉద్యోగులకు పలు రకాలుగా మేలు జరుగుతుందని రాజ్యసభ సభ్యులు,
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. సోషల్ మీడియా
వేదికగా గురువారం ఆయన పలు అంశాలపై స్పందించారు. జీపీఎస్ ద్వారా గ్యారెంటీ
పెన్షన్, కుటుంబానికి భద్రత, ఆరోగ్య భద్రత, జీవిత భీమా, మినిమం పెన్సన్
మొత్తం 5 రకాల ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు.
విశాఖలో త్వరలో మెట్రో’ పరుగులు : విశాఖ వాసుల చిరకాల స్వప్నం మెట్రో రైల్
ప్రాజెక్టుకు జనవరి 15న శంకుస్థాపన చేయనున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు.
తొలి విడతలో 76.90 కి.మీ. లైట్ మెట్రో నిర్మాణానికి ప్రణాళికలు
రూపొందించినట్లు తెలిపారు. మొదటిగా 42 స్టేషన్లతో కూడిన 3 కారిడార్ల నిర్మాణం
జరుగుతుందని అన్నారు. రూ.9. 699కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణం
జరుగుతుందని అన్నారు.
సాక్ష్యాలు చెరిపేయగల సమర్ధుడు చంద్రబాబు : రాష్ట్రపతి, ప్రధాని పదవులు
ఎవరికెళ్ళాలో నిర్ణయించిన వ్యక్తి, ఢిల్లీలో చక్రాలు తిప్పిన వ్యక్తి,
స్వయంప్రకటిత సాంకేతిక పరిజ్ఞాన ఆవిష్కర్త, ఆద్యుడు, సంపద సృష్టికర్తగా
చెప్పుకునే చంద్రబాబు స్కాంలు చేసి బెయిల్ పై బయట ఉంటే సాక్ష్యాలు ఇట్టే
చెరిపేయడం ఆయనకు ఎంతమాత్రమూ కష్టం కాదని అన్నారు. చంద్రబాబు బయటకు వస్తే
న్యాయం, సత్యం, ధర్మాన్ని బతకనిస్తారా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.