అమలు
రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి
కాకినాడ : అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రజలకు భూ యాజమాన్య
హక్కుల కల్పనకు, గ్రామాలను భూ వివాద రహితంగా మార్చేందుకు రాష్ట్ర
ప్రభుత్వం విప్లవాత్మకంగా జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష
కార్యక్రమాన్ని అమలుచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్
ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానందహాల్‌లో
వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్.. మిషన్ సభ్యులు జె.రామారావు, జిల్లా
వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ లంక ప్రసాద్, సర్వే ఏడీ
బి.లక్ష్మీనారాయణ తదితరులతో కలిసి సమగ్ర భూసర్వేపై సమావేశం
నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల రైతులు, వ్యవసాయ, అనుబంధ రంగాలకు
సంబంధించిన శాఖల అధికారులు, సర్వే, సెటిల్మెంట్స్, భూ రికార్డుల శాఖ
అధికారులు, సమగ్ర భూసర్వే డిప్యూటీ తహసీల్దార్లు, మండల సర్వేయర్లు
తదితరులు హాజరైన ఈ సమావేశంలో జిల్లాలో సమగ్ర భూసర్వే పురోగతితో పాటు
క్షేత్రస్థాయిలో రైతుల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపైనా చర్చించారు.
కాకినాడ జిల్లాలో జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష కార్యక్రమం కింద
తొలిదశలో 121 గ్రామాల్లో స్టోన్ ప్లాంటేషన్ పూర్తయిందని.. అదే విధంగా
రెండో దశలో ఇప్పటి వరకు 82 గ్రామాల్లో స్టోన్ ప్లాంటేషన్ పనులు
పూర్తయినట్లు అధికారులు వివరించారు. జిల్లాలో సమగ్ర భూసర్వే పనులు
ప్రణాళికాయుతంగా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర వ్యవసాయ
మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్
జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కులాలు, మతాలు,
వర్గాలు, రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు
అమలుచేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, సమర్థవంతమైన మానవవనరులతో సమగ్ర
భూసర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. డిజిటల్ పాస్‌బుక్‌లు
సైతం అందించే ఈ బృహత్తర కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని..
క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని గుర్తించి, ఉన్నత
స్థాయిలో పరిష్కరించేందుకు వీలుగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ సమావేశాలు
నిర్వహిస్తున్నట్లు వివరించారు. నూటికి నూరు శాతం ప్రజలకు న్యాయం
చేయాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష అని.. ఆ మేరకే కార్యక్రమాల అమలుకు
కృషిచేస్తున్నట్లు ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. రైతుల నుంచి వచ్చే
ఫిర్యాదులను అత్యంత నాణ్యతతో, సంతృప్తి చెందేలా పరిష్కరించనున్నట్లు
వెల్లడించారు. సమావేశంలో పశు సంవర్ధక శాఖ జేడీ డా. సూర్యప్రకాష్‌రావు,
వివిధ ప్రాంతాల రైతులు, అధికారులు తదితరులు హాజరయ్యారు.