100 ఎకరాల భూమి ఏపీఐ ఐసికి అవసరం ఉంది
కృష్ణా జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు
మచిలీపట్నం : కృష్ణా జిల్లా పారిశ్రామికంగా అడుగులు వేయాలని, మచిలీపట్నం
పోతేపల్లి లో ఇమిటేషన్ రోల్డ్ గోల్డ్ క్లస్టర్ మాదిరిగా పెడనలో సైతం కలంకారి
పరిశ్రమకు సంబంధించిన క్లస్టర్ ప్రారంభించాలని ఏపీఐ ఐసి అధికారులను జిల్లా
కలెక్టర్ పి. రాజాబాబు ఆదేశించారు.బుధవారం జిల్లా పారిశ్రామిక ఎగుమతుల
ప్రోత్సాహక కమిటీ (డిఐఇపిసి) సమావేశం కలెక్టరేట్ చాంబర్ లో కలెక్టర్
పి.రాజాబాబు అధ్యక్షతన జరిగింది. తొలుత కృష్ణాజిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్
మేనేజర్ ఆర్. వెంకటరావు జిల్లాలో పరిశ్రమల పరిస్థితిని ఎజెండాను వివరించారు.
అనంతరం కలెక్టర్ పి రాజాబాబు పారిశ్రామిక అనుమతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా
ఆయన మాట్లాడుతూ, కృష్ణాజిల్లా లో మచిలీపట్నం పోర్టు, ఫిషింగ్ హార్బర్
ఏర్పడనుండటంతో భవిష్యత్తు పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకొని 100 ఎకరాల
భూమిని కేటాయించాలని తక్షణమే అభ్యర్థిస్తూ దరఖాస్తు చేసుకోవాలని కృష్ణాజిల్లా
పరిశ్రమల కేంద్రం అధికారులకు సూచించారు.
ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో కేటాయించిన స్థలాల్లో ఇప్పటివరకు ఎన్ని పరిశ్రమలు
స్థాపించారు? ఎంత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు ? ఎంతమంది ఇప్పటివరకూ
అసలు పరిశ్రమలే మొదలుపెట్టలేదు? అందుకు గల కారణాలు ? స్థాపించిన పరిశ్రమలు
ఏవిధంగా పనిచేస్తున్నాయి ? ఒకవేళ అవి సరిగా పని చేయకపోతే ఎన్ని పరిశ్రమలు ఆ
విధంగా పనిచేయడం లేదో ? అన్న సమాచారం వివరిస్తూ తనకు సమగ్రమైన నివేదిక
సమర్పించాలని జిల్లా పరిశ్రమల శాఖ జీఎం వెంకట్రావును ఆదేశించారు.
ప్రధానమంత్రి విశ్వకర్శ యోజన పధకం పోర్టల్ ఇంకా ప్రారంభం కాలేదని, మన
రాష్ట్రంలో చిత్తూరు, నెల్లూరు. పశ్చిమ గోదావరి జిల్లాలకు మాత్రమే తొలి విడతగా
అనుమతించారని కానీ, కొందరు దళారులు ఆ పథకం తాలూకా లబ్దిని పొందవచ్చని
నిరుద్యగుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తన దృష్టికి వచ్చినట్లు
కలెక్టర్ తెలిపారు.
రెండో విడతలో కృష్ణా జిల్లాకు ఆ పథకం వచ్చే అవకాశముందని ఈ లోపు జనరల్ మేనేజర్
పరిశ్రమల శాఖ, స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, డి ఆర్ డి ఏ, డి ఎల్ డి ఓ
తదితర శాఖలు జిల్లాలో టైలరింగ్, వడ్రంగి, పెయింటర్లు తదితర 18 రంగాలలో ఆర్హత
గల అభ్యర్థులను నిష్పక్షపాతంగా గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎట్టి
పరిస్థితుల్లోనూ డబ్బులు చెల్లించి దరఖాస్తు చేయరాదని, ప్రధానమంత్రి విశ్వకర్మ
యోజన పథకంకు దరఖాస్తు ఆయా అభ్యర్థుల పరిధిలోని సచివాయంలో ఉచితంగా అప్లోడ్
చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. అలాగే, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి
ప్రాధాన్యత ఇవ్వాలని, పరిశ్రమల ఏర్పాటులో ఉన్న ప్రోత్సాహకాలను ఔత్సాహిక
పారిశ్రామికవేత్తలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పి రాజాబాబు
చెప్పారు. ఈ సమావేశంలో ముడా వి సి రాజ్యలక్ష్మి , ఏపీఐఐసి డిప్యూటీ డైరెక్టర్
విజయకుమార్ , ఎల్ డి ఎం విజయవర్ధిని, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఫణి
ధూర్జటి, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి శ్రీనివాస్, డి సీటీసీ
ఇన్స్పెక్టర్ అఫ్ ఫ్యాక్టరీస్,కాలుష్య నియంత్రణ మండలి ఈ ఈ, గ్రౌండ్ వాటర్ ఏ
డి , తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.