విశ్వమానవ సౌధానికి సఫాయి కార్మికుల త్యాగాలే పునాదిరాళ్లు
స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండి. గంధం చంద్రుడు
గుంటూరు : రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు గుణాత్మక అభివృద్ధిని సాధించడంలో
పారిశుద్ధ్య కార్మికుల శ్రమ గొప్పదని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ కొనియాడారు. పారిశుద్ధ్య కార్మికుల
కృషిని, త్యాగాలను గుర్తిస్తూ వారి సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర
ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తున్నదన్నారు. సోమవారం తాడేపల్లిలో పంచాయితీరాజ్
గ్రామీణాభివృద్ధి, పురపాలక, పట్టణాభావృద్ధి శాఖ, స్వచ్చాంధ్ర కార్పొరేషన్
సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర స్దాయి పారిశుద్ధ్య కార్మికులను
ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ సఫాయి కార్మికులంతా
వేకువజామునే పల్లెల్లో, పట్టణాల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని శుభ్రం
చేస్తూ. ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించి. డంపింగ్ యార్డుకు చెత్తను
చేరవేసి స్వచ్ఛతలో భాగస్వాములవుతున్నారని చెప్పారు. ఆరోగ్యవంతమైన సమాజం
నిర్మించడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర వెలకట్టలేనిదని రాజశేఖర్ అన్నారు.
పారిశుద్ధ్య కార్మికులు లేనిదే సమాజం మునగడ లేదని వీరు చేస్తున్న సమాజసేవ
భగవంతుడు ఇచ్చిన వరం అని ఆయన కొనియాడారు.
సఫాయి కార్మికుల ఆత్మ గౌరవాన్ని పెంపొందించి సమాజంలో అందరితో సమానంగా
జీవించేటట్టుగా ప్రజలందరి ఆలోచనలో మార్పురావల్సిన అవసరం ఉందన్నారు. సఫాయి
కార్మికులు సమాజానికి ఎంతో విలువైన వాళ్ళని, అటువంటి వారి యోగ క్షేమాలను ప్రతి
ఒక్కరు గుర్తించినప్పుడే వారి ఆత్మ గౌరవానికి విలువ ఇచ్చినట్టు అవుతుందని
రాజశేఖర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సఫాయి కార్మికుల సంక్షేమ పథకాల
రూపకల్పనలో స్వచ్చాంధ్ర కార్పొరేషన్ నిమగ్నమై ఉందని ఆయన వెల్లడించారు.
స్వచ్చాంధ్ర కార్పొరేషన్ నుంచి నివేదిక అందిన వెంటనే ప్రభుత్వం దృష్టికి
తీసుకువెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. ఏలూరు జిల్లా భీమడోలులో ప్రారంభమైన కాఫీ
విత్ క్లాప్ మిత్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని
రాజశేఖర్ ప్రకటించారు.
తర తరాలుగా కష్టజీవి శ్రమతోనే ఈ ప్రపంచంలో సంపద సృష్టి జరుగుతున్నదని,
మహోన్నతమైన విశ్వమానవ సౌధానికి సఫాయి కార్మికుల త్యాగాలే పునాదిరాళ్లని
స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండి. గంధం చంద్రుడు ప్రశంసించారు. సఫాయి
కార్మికుల పిల్లల భవిష్యత్తు కోసం ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. సఫాయి
కార్మికుల పిల్లలు అదే వృత్తిలో కొనసాగకుండా ఉన్నత చదువులు చదివే విధంగా
చేయాలన్నదే తమ కార్పొరేషన్ లక్ష్యమని గంధం చంద్రుడు స్పష్టం చేశారు. కార్మిక
సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు
చేస్తున్నదన్నారు. సఫాయి కర్మచారి ఆందోళన్ నిర్వహకులు బెజవాడ విల్సన్
మాట్లాడుతూ సమాజంలో లోపాలు, హెచ్చు తగ్గులవల్ల కుల వ్యవస్ధ జాడ్యం ఇంకా
పట్టిపీడిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికులంటే ఒక
కులానికి చెందిన వారే అన్న భావన ఉండడం వల్లే సమాజంలో రుగ్మతలు ఏర్పడు
తున్నాయన్నారు. ఎస్ సి కార్పొరేషన్ ఎండి చిన్నరాముడు, పంచాయితీరాజ్ అదనపు
కమిషనర్ సుధాకర్ , సఫాయి కర్మచారి ఆందోళన్ ప్రతినిధి దీప్తి తదితరులు ఈ
కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన 84
మంది సఫాయి కార్మికులను ఈ సందర్భంగా సత్కరించారు.