విదేశాలకు పారిపోతున్న చంద్రబాబు, లోకేష్ సన్నిహితులు
డబ్బుతో సానుభూతి కొనుక్కుంటున్న చంద్రబాబు
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
విజయవాడ : కోవిడ్ అనంతరం గత 27 నెలల్లో రాష్ట్రంలో పెట్టుబడులు
ఊపందుకున్నాయని, రూ.60,486 కోట్లు పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయని
రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి
పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సోమవారం పలు అంశాలు వెల్లడించారు.
ఇదే సమయంలో కొత్తగా రూ.32,697 కోట్లు ఒప్పందాలు కుదిరినట్టు తెలిపారు. ఈ
ఏడాది తొలి మూడు నెలల్లో రూ.7,187 కోట్ల ఒప్పందాలు కుదిరాయని డీపీఐఐటీ తాజా
గణాంకాల్లో వెల్లడైనట్లు తెలిపారు.
రాష్ట్రంలో 1830 మందికి విద్యాదీవెన కింద ఆర్థిక సహాయం : రాష్ట్రంలో 1830 మంది
విద్యార్థులకు విదేశీ విద్యాదీవెన కింద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆర్థిక
సాయం అందించిందని విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ పథకం కింద కోటి నుంచి కోటి 25
లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. గతంలో చంద్రబాబు
నాయుడు ప్రభుత్వంలో రూ. 10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు మాత్రమే విదేశీ విద్య
కోసం ఆర్థిక సాయం అందించారని అన్నారు. గత ప్రభుత్వ లోపాలు చక్కదిద్ది
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తోందని అన్నారు.
విదేశాలకు పారిపోతున్న చంద్రబాబు, లోకేష్ సన్నిహితులు : స్కిల్ స్కాంలో తప్పు
చేయకపోతే, సాక్షాలు లేకపోతే చంద్రబాబు, లోకేష్ సన్నిహితులు ఒక్కొక్కరూ
విదేశాలకు ఎందుకు పారిపోతున్నారని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. అడ్డంగా
దొరికిపోయామని వారిని దేశం దాటించిన వారికి తెలుసని అన్నారు. ఎన్నికల తరువాత
టీడీపీది పూర్తిగా పలాయనవాదమేనని విజయసాయిరెడ్డి అన్నారు.
డబ్బుతో సానుభూతి కొనుక్కుంటున్న చంద్రబాబు : రాజమహేంద్రవరం లో చంద్రబాబు
కుటుంబసభ్యుల పరామర్శలో సింపతీ ఏరులై పారేలా రక్తికట్టించడానికి డబ్బిచ్చి
జనాన్ని తీసుకొస్తున్నారని అన్నారు. ఇది వాళ్లకు కొత్తేం కాదని డబ్బు
వెదజల్లితే ఏ పని అయినా జరిగిపోతుందని ఇప్పటికీ, ఎప్పటికీ గట్టిగా నమ్మే
పార్టీ టీడీపీ అని అన్నారు. టీడీపీ పునాదులే దోపిడీపైన ఏర్పడ్డాయని
విజయసాయిరెడ్డి అన్నారు.