భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు 45 ఏళ్ల రాజకీయ జీవితం ప్రజలతోనే ముడిపడి ఉందని
చెప్పారు. ఏం తప్పు చేశారని 17 రోజులుగా ఆయన్ను జైల్లో నిర్బంధించారని
ప్రశ్నించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట పర్యటనలో భాగంగా పట్టణంలో టీడీపీ
వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం భువనేశ్వరి మాట్లాడారు.
ఆయనకు ప్రజలే ఊపిరి : ‘‘మా కుటుంబానికి ప్రజల డబ్బు అవసరం లేదు. నేనూ ఓ
కంపెనీని నడుపుతున్నా. అందులో 2 శాతం అమ్ముకున్నా నాకు రూ.400 కోట్లు వస్తాయి.
ప్రజల సొమ్ము మాకు అక్కర్లేదు. మా కుటుంబమంతా ఎన్టీఆర్ అడుగుజాడల్లో
నడుస్తున్నాం. ప్రజల కోసం మా కుటుంబం ఎప్పుడూ ఉంటుంది. మాకు ఎలాంటి కోరికలు
లేవు.. ఉన్నంతలో తృప్తి పడతాం. ఎన్టీఆర్ ట్రస్ట్‌తో ఎన్నో సేవా కార్యక్రమాలు
చేపడుతున్నాం. గర్వంగా చెబుతున్నా. ప్రభుత్వాల కంటే కూడా ఎన్టీఆర్ ట్రస్ట్
ముందుండి సేవలు అందిస్తోంది. ట్రస్ట్ ద్వారా 2వేల మంది అనాథ, పేద పిల్లలను
ఉచితంగా చదివిస్తున్నాం. చంద్రబాబుకు ప్రజలే ఊపిరి. రాష్ట్రాన్ని అభివృద్ధి
చేయాలని తపించే వ్యక్తి ఆయన. రాళ్లు, రప్పల మధ్య హైటెక్ సిటీ నిర్మాణం
చేపట్టారు. దాంతో ఇప్పుడు వేలాది కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తోంది. అదీ ఆయన
ఆలోచన.. ముందుచూపు అన్నారు.
చంద్రబాబు ఏ తప్పూ చేయలేదు : రాత్రింబవళ్లు ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిని
జైల్లో నిర్బంధించారు. చంద్రబాబు ఏ తప్పూ చేయలేదు. ప్రజల కోసం ఆయన
జైలుకెళ్లారు. స్కిల్ డెవలప్మెంట్ సంస్థ వల్ల చాలా మంది ఉపాధి పొందారు.
కొందరు సొంతంగా కంపెనీలు పెట్టుకుని సీఈవో స్థాయికి ఎదిగారు. స్కిల్
డెవలప్మెంట్ సంస్థను తీసుకురావడం తప్పా? దీనిపై ప్రజలే ఆలోచించాలి. మా
కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఐటీ ఉద్యోగులను
పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నా. తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి వీసా,
పాస్‌పోర్టు కావాలా? ఇది ప్రజాస్వామ్యం. ఎక్కడికైనా వెళ్లే హక్కు ప్రజలకు
ఉంటుంది. శాంతియుతంగానే ర్యాలీ చేపడితే ప్రభుత్వం, పోలీసులు భయపడ్డారని
భువనేశ్వరి అన్నారు.