ప్రభుత్వానివి చందమామ కథలు.. సీఐడీవి చిలకపలుకులు
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు
అమరావతి : రాష్ట్రంలో అన్ని రంగాలు కుదేలవుతుంటే ఆధారాలు లేని స్కామ్‌ల పేరుతో
సీఎం జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల
రామకృష్ణుడు ధ్వజమెత్తారు. అర్ధాంతరంగా అరెస్టు చేసి, కోర్టుల ముందు అబద్ధాలు
పెట్టి టీడీపీ అధినేత చంద్రబాబు నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారని
మండిపడ్డారు. రైతు ఆత్మహత్యలు, నిత్యావసర ధరలు, పన్నుల భారం, నిరుద్యోగం,
ఎయిడెడ్ విద్యాసంస్థల మూసివేత ఇవేవీ జగన్ ప్రభుత్వానికి కనపడవా? అని
ప్రశ్నించారు. సీఎం జగన్ అన్ని వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకొన్నారని,
అసెంబ్లీలో తమ పరిపాలనను, తప్పులను ఎవరు ప్రశ్నించరాదనే ఉద్దేశంతో
వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ఏనాడు అసెంబ్లీలో
ప్రజా సమస్యలపై చర్చ జరిగిన దాఖలాలు లేవని విమర్శించారు. స్కిల్ డెవలప్మెంట్
కేసుకు సంబంధం ఉన్న నీలం సహాని, అజెయ కల్లాం, ఐవైఆర్ కృష్ణారావులను ఎందుకు
విచారించడం లేదని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం చందమామ కథలు అల్లుతూ సీఐడీ చేత
చిలకపలుకులు పలికిస్తోందని యనమల విమర్శించారు. అన్నీ వ్యవస్థలను తమ గుప్పెట్లో
పెట్టుకొన్నట్లే అసెంబ్లీలో కూడా తమ పరిపాలనను, తప్పులను ఎవరు ప్రశ్నించరాదనే
ఉద్దేశ్యంతో వ్యవహరిస్తున్నారన్నారు. ఆధారాలు లేని స్కిల్ డెవలప్ మెంట్
కేసులో తన వాదన చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అర్ధాంతరంగా అరెస్ట్ చేసి
కోర్టుల ముందు అబద్దాలు పెట్టి నిర్భందాన్ని కొనసాగిస్తున్నారని, ఈ పోకడ
ప్రజాస్వామ్య వ్యవస్థకు, రాష్ట్ర భవిష్యత్ కు ప్రమాదంగా మారుతుందని యనమల రామ
కృషుడు హెచ్చరించారు.