విజయవాడ : ఫార్మసీ ప్రవేశాలకు నిర్దేశించిన ఎపి ఈసెట్ తుదిదశ షేడ్యూలును
సాంకేతిక విద్యా శాఖ కమీషనర్, అడ్మిషన్ల కన్వీనర్ చదలవాడ నాగరాణి శనివారం
విడుదల చేసారు. తాజా నోటిఫికేషన్ ను అనుసరించి సెప్టెంబరు 25, 26 తేదీలలో
విద్యార్ధులు ఆన్ లైన్ లో రిజిస్టేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు చేయవలసి
ఉంది. సెప్టెంబరు 25 నుండి 27 వరకు ఆన్ లైన్ ద్వారా ధృవీకరణ పత్రాల
వెరిఫికేషన్, ఆఫ్షన్ల ఎంపికకు అవకాశం కల్పించారు. ఎవరైన విద్యార్ధులు
ఆఫ్షన్లను మార్చుకోదలిస్తే 27వ తేదీ మాత్రమే అవకాశం ఉంటుంది. 28వ తేదీ అయా
కళాశాలల్లో రిజర్వేషన్లను అనుసరించి సీట్ల కేటాయింపు ఉంటుంది. 29,30 తేదీలలో
విద్యార్ధులు తమకు కేటాయించిన కళాశాలల్లో వ్యక్తిగతంగా రిపోర్టు చేయాలి.
ఇప్పటికే క్లాసులు ప్రారంభం అయినందున విధ్యార్దులు ఈ అవకాశాన్ని సద్వినియోగం
చేసుకుని ఫార్మసీ అడ్మిషన్లను పొందాలని కన్వీనర్ నాగరాణి పేర్కొన్నారు.