చట్టం ముందు అందరూ సమానమే
ఎవ్వరికీ మినహాయింపులుండవు
వైయస్సార్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
విజయవాడ : స్కిల్ స్కాం నిజమన్నది తెలుగుదేశం పార్టీకి తెలుసని అందుకే
అసెంబ్లీలో చర్చ జరిగితే నిజాలు బయటపడతాయని కవ్వింపు చర్యలకు ఆ పార్టీ
పాల్పడుతుందని రాజ్యసభ సభ్యులు,వైయస్సార్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి
విజయసాయిరెడ్డి అన్నారు. పలు అంశాలపై ఆయన శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు.
అసెంబ్లీలో ఏం చెయ్యాలో దిక్కుతోచక భయంతో పలాయనవాదాన్ని నమ్ముకొని కవ్వింపు
చర్యలకు తెర లేపిందని మండిపడ్డారు. చట్టం ముందు అందరూ సమానులేనని, ఎవరికీ
మినహాయింపులు ఉండవని రాజ్యాంగం విస్పష్టంగా చెప్తుందని ఆయన గుర్తు చేశారు. 74
ఏళ్ల వృద్ధుడిని ఎలా అరెస్ట్ చేస్తారు? ప్రభుత్వంలో ఏదో జరిగితే ఆయనకేం
సంబంధమనే వింత వాదనలు చేస్తున్న వారు న్యాయస్థానం నిర్ణయాన్ని తప్పుబట్టే
సాహసం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ నేరం చేయకపోతే నిర్దోషిగా బయటికొస్తారు
కదా అని టిడిపి శ్రేణులను ప్రశ్నించారు. టిడిపి అధినేత చంద్రబాబు తప్పుదోవ
పట్టించి కేసును మరింత జటిలం చేసుకున్నారని చెప్పారు. ఏ నేరం చేయలేదని
బుకాయిస్తూ క్వాష్ పిటీషన్ దాఖలు చేయించారన్నారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నందునే
సిఐడి కోర్టు రిమాండు విధించిందన్న విషయాన్ని లెక్క చేయకుండా మెయింటెయినబుల్
కాని క్వాష్ పిటీషనుతో హైకోర్టుతో అక్షింతలు వేయించుకున్నారని ఆయన చెప్పారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో దోమల బెడద లేదని, లార్వా ఆనవాళ్లే లేవని స్వయంగా
జైళ్ల డిఐజినే చెప్పారని తెలిపారు. బహుశా దోమలపై దండయాత్ర పేరుతో నిధులు
మింగేశారన్న కోపంతో దోమలు బయట నుంచి వచ్చి కుట్టేసి పోతున్నాయేమో అన్న అనుమానం
వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బెయిల్ పిటిషను రద్దయితే లోపలకు
వెళ్లి ఇద్దరూ కలిసి జైలులో దోమలపై దండయాత్రలు కొనసాగించవచ్చని ఎద్దేవా చేశారు.