విజయవాడ : మద్యం, ఇసుక దందాలను నిలదీస్తే వ్యక్తిగత విమర్శలకు దిగుతారా అని
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామినిశర్మ ప్రశ్నించారు. శనివారం బీజేపీ
పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘‘ఏపీలో వైసీపీ పరిస్థితి ఆడలేక
మద్దెల దరువు అన్న విధంగా ఉంది. జగన్మ ద్యం అక్రమాలను మా అధ్యక్షురాలు
పురంధరేశ్వరి ఆధారాలతో చూపిస్తే తట్టుకోలేక పోయారు. మీ అరాచకాలు, అవినీతిని
ప్రశ్నిస్తే కేసులు పెడతారా.? ఒక మహిళ అనే ఇంగితం కూడా లేకుండా వ్యక్తిగత
విమర్శలకు దిగుతారా..? అధికారం ఇస్తే మంచి పాలన అందించడం చేతకాదు. మా మానసిక
స్థైర్యాన్ని దెబ్బ తీయాలని చూస్తున్నారు. ప్రజలకు మంచి పాలన ఇస్తారనే
వైసీపీకి అధికారం ఇచ్చారు. వైసీపీ నాయకులు ఇంత నీచంగా దిగజారి మాట్లాడతారా.?
మీ లాంటోళ్లకు తగిన బుద్ధి చెప్పే ధైర్యం, దమ్ము బీజేపీకి ఉన్నాయి.
అన్నివర్గాల ప్రజలు జగన్ పాలన ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తున్నారు. జగన్
ప్రభుత్వం అసమర్థ పాలన చేస్తోంది. జగన్ దోచుకున్న ప్రతి పైసా దుర్వినియోగం
చేస్తున్నారు. ప్రజలకు మంచి పాలన చేయండి, లేదంటే ప్రజలే మీకి బుద్ధి చెబుతారని
ఆగ్రహం వ్యక్తం చేశారు.