కోటంరెడ్డి, అనగాని సస్పెన్షన్
అసెంబ్లీలో మీసం మెలేయడం వంటి పనులు బాలయ్య చేశారన్న స్పీకర్
ఇంకోసారి ఇలాంటి పనులు చేయొద్దని హెచ్చరించిన స్పీకర్
బాటిల్ పగులగొట్టారంటూ కోటంరెడ్డి, అనగానిలపై సస్పెన్షన్ వేటు
గుంటూరు : ఏపీ అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు వాడీవేడిగా సాగాయి. టీడీపీ అధినేత
చంద్రబాబు అరెస్ట్ పై వాయిదా తీర్మానాన్ని పట్టుబడుతూ ఆ పార్టీ సభ్యులు
ఆందోళనకు దిగారు. స్పీకర్ ఛైర్ వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు
మంత్రి అంబటి రాంబాబుపై మీసం మెలివేస్తూ, దమ్ముంటే రా అని టీడీపీ ఎమ్మెల్యే
బాలకృష్ణ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో సభను స్పీకర్ వాయిదా వేశారు. వాయిదా
అనంతరం సభ ప్రారంభమైన తర్వాత బాలకృష్ణకు స్పీకర్ హెచ్చరిక జారీ చేశారు. సభలో
మీసాలు మెలివేయడం, తొడగొట్టడం వంటి రెచ్చగొట్టే పనులను బాలకృష్ణ చేశారని,
ఇంకోసారి ఇలాంటి పనులు చేయవద్దని ఆయనకు తొలి హెచ్చరిక జారీ చేస్తున్నామని
చెప్పారు. మరోసారి ఇలాంటి పనులు చేస్తే సభ నిబంధనల ప్రకారం చర్యలు
తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే అనగాని
సత్యప్రసాద్, వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను ఈ
అసెంబ్లీ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. సభా
స్థానంలో ఉన్న ఫైళ్లను చించేశారని, బాటిల్ ను పగలగొట్టారని, మైక్ లాగేశారని,
వైర్లు తెంచేశారని, వీరి ప్రవర్తనను గర్హిస్తూ వీరిద్దరిని ఈ సెషన్ మొత్తానికి
సస్పెండ్ చేస్తున్నానని తెలిపారు. వీరి మొత్తం వ్యవహారాన్ని పరిశీలించి
నివేదిక ఇవ్వాల్సిందిగా ఎథిక్స్ కమిటీని కోరుతున్నానని చెప్పారు. ఇలాంటి
సభ్యుల ప్రవర్తనను మనం ఖండించలేకపోతే సభా మర్యాదను కాపాడలేమని అన్నారు.
శాసనసభ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అక్రమమంటూ శాసనసభలో ఆందోళన
చేపట్టిన ఆ పార్టీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారామ్ సస్పెండ్ చేశారు.
సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
ఆరోపించారు. అనంతరం 15 మందిని సస్పెండ్ చేయాలంటూ స్పీకర్‌ను ఆయన కోరారు.
దీంతో 14 మంది టీడీపీ సభ్యులు, వైసీపీ కి చెందిన ఉండవల్లి శ్రీదేవిని గురువారం
సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు.
సస్పెండైన టీడీపీ ఎమ్మెల్యేల్లో
కింజరాపు అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ,వ్ బెందాళం అశోక్, ఆదిరెడ్డి
భవాని, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, గణబాబు, పయ్యావుల
కేశవ్, గద్దె రామ్మోహన్, నిమ్మల రామా నాయుడు, మంతెన రామరాజు, గొట్టిపాటి
రవికుమార్, ఏలూరి సాంబ శివరావు, డోలా బాల వీరాంజనేయ స్వామి ఉన్నారు.