ఏపీ శాసనమండలిలో కూడా తీవ్ర గందరగోళం.. సభ వాయిదా
ఉభయసభల్లో ఆందోళనకు దిగిన టీడీపీ సభ్యులు
టీడీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన మండలి ఛైర్మన్
టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం
అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఏపీ శాసనసభ సమావేశాల్లో
దుమారం రేపింది. ఉభయ సభల్లోను టీడీపీ సభ్యులు చంద్రబాబు అరెస్ట్ అక్రమమంటూ
ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గురువారం మొదలైన శాసన సభ వర్షాకాల సమావేశాల్లో
అసెంబ్లీలో స్పీకర్ ఛైర్ ను చుట్టుముట్టారు. ఈ క్రమంలో అసెంబ్లీని స్పీకర్
వాయిదా వేశారు. మరోవైపు శాసనమండలిలో కూడా ఇదే సీన్ కొనసాగింది. టీడీపీ
ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. చంద్రబాబు అరెస్ట్ పై వాయిదా తీర్మానాన్ని
ఇచ్చారు. అయితే ఈ తీర్మానాన్ని మండలి ఛైర్మన్ తిరస్కరించారు. దీంతో టీడీపీ
సభ్యులు పోడియంలోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ
క్రమంలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో,
సభను మండలి ఛైర్మన్ వాయిదా వేశారు.
మొదటి రోజే తీవ్ర గందరగోళ పరిస్థితులు
ఏపీ శాసనసభ సమావేశాల మొదటి రోజే తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆ అంశంపై
చర్చించాలంటూ తెలుగు దేశం వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనిపై చర్చకు స్పీకర్
నిరాకరించడంతో టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియం వద్దకు
ప్లకార్డులతో వెళ్లి నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులపైకి
వైసీపీ సభ్యులు దూసుకొచ్చారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం
చోటుచేసుకుంది. ఈ పరిస్థితులతో సభలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
దీంతో స్పీకర్ సభను కాసేపు వాయిదా వేశారు.