కాంగ్రెస్ తోనే విభజన చట్టం అమలు
త్వరలోనే రాష్ట్రానికి రాహుల్, ప్రియాంక, ఖర్గే
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో రాష్ట్ర సమస్యలు అధిష్టానం దృష్టికి
ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు
విజయవాడ : కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ లో నిర్వహించిన మూడు
రోజుల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ కి సంబందించి కీలక
నిర్ణయాలు తీసుకున్నట్లు పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు.
దీనికి సంబంధించి సమావేశాల చివరి రోజు., ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రం విడిపోయి దాదాపు దశాబ్ద కాలం పూర్తవుతున్నా ఆంధ్రప్రదేశ్ కు మాత్రం
తీవ్ర అన్యాయం జరుగుతూనే ఉందని, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున
ఖర్గే కు వివరించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర విభజనకు ముందు యు పి ఏ
ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇచ్చిన ఒక్క హామీ కూడా ప్రధాని నరేంద్ర
మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదని ఈ సందర్భంగా పీసీసీ
అధ్యక్షులు కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. గతంలో అధికారంలో ఉన్న
టీడీపీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కూడా తమ స్వప్రయోజనాల కోసం, రాష్ట్ర
భవిష్యత్ ను బీజేపీ కి తాకట్టు పెట్టారని స్పష్టం చేశారు. గత 10 సంవత్సరాలలో
ఏపీ కి జరిగిన అన్యాయాలకు సంబంధించి, పూర్తి వివరాలతో ఖర్గే కు ఒక మెమరాండం
సమర్పించినట్లు ఆయన వివరించారు.
మొదటి సంతకం ప్రత్యేక హోదా పైనే
కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అని ధీమా వ్యక్తం చేసిన
రుద్రరాజు “ఇండియా” ప్రభుత్వ మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఫైల్
పైనే ఉంటుందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ 2018లో కర్నూల్ సభలో ఇదే విషయాన్ని
చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. అదే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ కు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న నష్టాన్ని పూడ్చగల ఏకైక పార్టీ
కాంగ్రెస్ మాత్రమే అని తెలిపారు. బీజేపీ, వైసీపీ, టీడీపీ వల్ల ఆంధ్రప్రదేశ్ కు
తీవ్ర నష్టంతో పాటు తీరని అన్యాయం జరుగుతుందని విమర్శలు చేశారు.
హోదా, ఆస్తులు, హక్కులు
పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన ఐదు సంవత్సరాల ప్రత్యేక హోదా,
పోలవరాన్ని పూర్తి చేయడం, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక
ప్రతిపత్తి, కొత్త రాజదాని నిర్మాణానికి ఆర్థిక సహాయం, 9, 10 షెడ్యూల్ లో ఉన్న
వేల కోట్ల రూపాయల ఆస్తుల్లో రాష్టానికి 58 శాతం వాటా పంపకం, 2014 – 15 ఆర్థిక
సంవత్సరానికి బడ్జెట్ లోటు భర్తీ చేయడం, విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్
అభివృద్ధి, విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు, దుగరాజపట్నం పోర్ట్
నిర్మాణానికి ఆర్థిక సహాయం, కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం వంటి విషయాల్లో
ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని
పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు విమర్శించారు. హక్కుల సాధన కోసం ఒత్తిడి
చేయాల్సిన రాష్ట్రానికి చెందిన అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు కేంద్రం
చేతిలో కీలు బొమ్మలు గా మారాయని విమర్శించారు. బీజేపీ అధిష్టానం చెప్పినట్లు
తోలు బొమ్మల్లా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మాత్రమే విభజన హామీలను
అమలు చేయగలదు అని పేర్కొన్నారు.
ఆంధ్రుల సెంటిమెంట్ తో ఆటలు…
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న
కేంద్రంలోని బీజేపీ., విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో దుర్మార్గపు వైఖరి
అవలంబిస్తుందని పీసీసీ అధ్యక్షులు దుయ్యబట్టారు. ప్రజల సెంటిమెంటును కూడా
పట్టించుకోకుండా లాభాల్లో ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం
చేసేందుకు చర్యలు చేపట్టారని వెల్లడించారు. స్వర్గీయ ఇందిరా గాంధీ హయాంలో
ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను.., ఆ తరువాత వచ్చిన కాంగ్రెస్ ప్రధానులు
రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు లు ఎంతో అభివృద్ధి చేసారని తెలిపారు. దేశంలోనే
మొదటి iso సర్టిఫికేషన్ పొందిన, నవరత్న కంపెనీ ఐన విశాఖ స్టీల్ కు
ఉద్దేశపూర్వకంగా ఇనుప గనులు(క్యాప్టివ్ మైన్స్) కేటాయించకుండా నష్టాలలోకి
మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపించారు. రాష్ట్రానికి జరుగుతున్న
ఇటువంటి అనేక అన్యాయాలను cwc సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి
తీసుకెళ్లగా, న్యాయం చేసే దిశగా సానుకూలంగా స్పందించినట్లు రుద్రరాజు
తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విభజన చట్టం అమలు చేసి న్యాయం
చేస్తామని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతామని అధిష్టానం హామీ ఇచ్చినట్లు ఆయన
స్పష్టం చేశారు.
జోడో తో జోష్… రాష్ట్రానికి రాహుల్…
మొదటి దశ జోడో యాత్రతో ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన రాహుల్ గాంధీకి ప్రజలు
బ్రహ్మరథం పట్టారని రుద్రరాజు పేర్కొన్నారు. అదే విధంగా మరింతగా ఆంధ్రప్రదేశ్
ప్రజల విశ్వాసాన్ని పొందడానికి, వారిలో మరింత చైతన్యం నింపడానికి రాహుల్
గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి ముఖ్య నేతల బహిరంగ సభలను
ఆంధ్రప్రదేశ్ లోని మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల
ముందు విశాఖపట్నం లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ,
విజయవాడలో ప్రియాంక గాంధీ, తిరుపతి, అనంతపురం ప్రాంతాల్లో మల్లికార్జున ఖర్గే
లతో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. బీజేపీ మోసపూరిత
కుట్రలతో పాటు దానికి కొమ్ము కాస్తున్న వైసీపీ, టీడీపీ లకు ప్రజలే తగిన బుద్ధి
చెప్పాలని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పూర్వ వైభవం కోసం., వచ్చే
ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపించాలని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు
పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్. రఘువీరా రెడ్డి, మల్లు భట్టు విక్రమార్క
వంటి నేతలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు జాతీయ స్థాయి నేతలతో
పీసీసీ అధ్యక్షులు రాష్ట్ర రాజకీయ పరిస్థితులతో పాటు వివిధ అంశాలపై
ప్రత్యేకంగా చర్చించారు.