ఏపీలో అభివృద్ధి కన్నా ఆందోళన కలిగించే పాలన కొనసాగుతోంది
విభజన వల్ల రాష్ట్ర నాయకులు నష్టపోలేదు. ప్రజలే నష్టపోయారు
జన సేన నేత నాదెండ్ల మనోహర్
అమరావతి : వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను జనసేన ప్రశ్నిస్తోందని ఆ
పార్టీ నేత నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. శనివారం జనసేన కార్యాలయంలో ఏపీ
తాజా పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా మనోహర్
మీడియాతో మాట్లాడుతూ మనల్ని ఎంతోమంది ధూషించినా ప్రజలకోసం మన అధినేత పవన్
కళ్యాణ్ పని చేస్తున్నారు. ప్రభుత్వం అంటే భవనాలు, రోడ్లు, మంత్రులు,
ముఖ్యమంత్రి కాదు. ప్రజలకు మేలు చేయాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఏపీలో
అభివృద్ధి కన్నా ఆందోళన కలిగించే పాలన కొనసాగుతోంది. ముఖ్యమంత్రి
జగన్మోహన్రెడ్డి కేవలం ఘర్షణ వాతావరణం సృష్టించి వివాదాలు చేస్తున్నారు. ఇతర
రాష్ట్రాలతో పోటీ పడే పరిస్థితి లేకుండా వెనుకబడి పోయాం.151స్థానాలు అందిస్తే
అభివృద్ధి లేకుండా అరాచకాలు చేశారు. పవన్ కళ్యాణ్‌తో జనసేనలో నా ప్రస్థానం
ఐదేళ్లు.ఆయన నుంచి విలువలతో కూడిన రాజకీయాలు నేర్చుకున్నా. మనం రాజకీయం చేసినా
కొన్ని విలువలు పాటించాలి.
అధికార పార్టీకి అసలు విలువలే పట్టడం లేదు. ధైర్యంగా ప్రజల కోసం పోరాడేలా
జనసేన నిలబడింది. దారుణాలు, అన్యాయం జరిగిన పాలకులను అడిగే పరిస్థితి లేదు. ఆ
ఆలోచన విధానం మార్చడానికి క్యాడర్‌కి పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు.నేడు
ప్రభుత్వం తప్పులను ప్రశ్నించే ధైర్యం తెచ్చారు. ధర్మాన్ని మీరు
కాపాడండి…ధర్మం మిమ్మలను రక్షిస్తుంది. పవన్ కళ్యాణ్ కష్టం, శ్రమతో నేడు
మనమంతా ఇలా నిలబడ్డాం. మన జన సైనికులు, నాయకులు మన అధినేతకు అండగా ఉన్నారు.
రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఏపీలో సభాపతిగా నేను ఉన్నాను. గెజిట్ నోటిఫికేషన్
వచ్చే వరకు అక్కడ చర్చల్లో పాల్గొన్నాను.
రాష్ట్రం చీలిపోతుంటే నాకు బాధ, ఆవేదన కలిగింది.తెలంగాణ ప్రజల కోరిక విభజనను
గౌరవించాం. కానీ విభజిత ఏపీకి న్యాయం జరిగేలా పాలకులు చేయలేదు. నాయకులు
మాట్లాడకుండా ఉన్న వైనం ఆలోచింప చేసింది. విభజన వల్ల రాష్ట్ర నాయకులు
నష్టపోలేదు. ప్రజలే నష్టపోయారు. రాష్ట్ర విభజన తర్వాత జగన్ కుట్ర పూరితంగా
సిట్టింగ్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాడు. విడతల వారీగా రాజీనామా చేయించి 25
బై ఎలక్షన్ జరిగేలా చేశాడు. ఆరోజే జగన్ కుట్ర పూరితంగా రాష్ట్ర నాశనం కోరాడు.
ఎన్నికల ప్రక్రియ వల్ల అభివృద్ధి, పాలన కుంటు పడింది. జగన్ మొదటి నుంచీ
చేస్తున్న కుట్రలు, మోసాల గురించి ప్రజలు తెలుసుకోవాలి. దాష్టికాలు, దాడులు,
అన్యాయంగా నేటికీ పాలన చేస్తున్నారు. 2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఓటమి
చెందినా ప్రజల కోసం నిలబడ్డారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.