అమరావతి : 2024 లో ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న ఎన్నికలు వైఎస్సార్సీపీ వర్సెస్
టీడీపీ మాత్రమే కాదని, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు చంద్రబాబు అధికార
దురాశకు మధ్య జరుగుతున్న ఎన్నికలని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన
కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. సోషల్ మీడియా వేదికగా శుక్రవారం ఆయన ఈ
అంశంపై స్సందించారు. అలాగే ఈ ఎన్నికలు విశ్వసనీయతకు- యూటర్న్ రాజకీయాలకు,
స్థిరత్వానికి-అస్థిరతకు, నిజాయతీకి-అవకాశవాదానికి, ఐక్యతకు-కులరాజకీయాలకు,
ప్రజలందరి ప్రయోజనాలకోరే నేతకు- క్రోనీ క్యాపిటలిజం అనుసరించే నాయకుడికి మధ్య
జరుగుతున్న ఎన్నికలని ఆయన అభివర్ణించారు. ఈ ఎన్నికలు సీఎం జగన్ నేతృత్వంలోని
ప్రజలకు-మొత్తం ప్రతిపక్షానికి మధ్య జరుగుతున్న సమరమని, తోడేళ్ల గుంపుకు
సింహానికి మధ్య జరుగుతున్న పోరాటమని ఆయన అన్నారు.
స్కిల్ స్కాంలో చంద్రబాబు పాత్ర సుస్పష్టం : సీమెన్స్ ప్రమేయమే లేకుండా ఆ
సంస్థ పేరుతో చంద్రబాబు బురిడీ కొట్టించినట్లు స్పష్టమయ్యిందని విజయసాయి
రెడ్డి చెప్పారు. ఖైదీ నంబర్ 7691 (చంద్రబాబు) కుట్ర పూణేలో వెలుగులోకి
వచ్చిందని తెలిపారు. అగ్రిమెంట్ లో తేదీ, లెటర్ నంబర్ కూడా లేదని, స్కాంకు
సంబంధించిన ఫైళ్లను సెక్రటేరియట్ లో తగులబెట్టారని అన్నారు. ఈ స్కాంలో రూ.కోటి
విలువను 250 కోట్లకు పెంచారని తెలిపారు. నాలుగు లేయర్లలో డబ్బులు పంపిణీ
జరిగినట్లు ఆధారాలు లభించినట్లు తెలిపారు.
వైద్యం, వైద్య విద్యకు అధిక ప్రాధాన్యం : రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా
ఏకకాలంలో 5 మెడికల్ కాలేజీల్లో అకడమిక్ తరగతులు ప్రారంభించడం గొప్ప విషయమని
ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే సాధ్యపడిందని విజయసాయి రెడ్డి తెలిపారు.
ఏలూరు, విజయనగరం, రాజమహేంద్రవరం, నంద్యాల, మచిలీపట్నంలలో మొత్తం 5 ప్రభుత్వ
మెడికల్ కాలేజీలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతులు మీదుగా ప్రారంభం కావడం
గొప్ప పరిణామమని ఆయన తెలిపారు.