అమరావతి : సీమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్ ఇండియా ప్రైవేట్
లిమిటెడ్‌కి, సీమెన్స్‌కి సంబంధం లేదని నిరూపించగలరా? అని ఏపీ సీఐడీ చీఫ్
సంజయ్‌కు టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ సవాల్ విసిరారు. మీడియా
సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘ఆ రెండూ సంస్థలూ ఒక్కటే అని నేను నిరూపిస్తా. కాదని
మీరు నిరూపించగలగరా?’ అని ప్రశ్నించారు. జర్మనీకి చెందిన సీమెన్స్ ఒక్కో
దేశంలో ఒక్కో పేరుతో సేవలు అందిస్తోందన్నారు. యూకే, యూఎస్, నెదర్లాండ్స్,
ఇండియాలో ప్రారంభించారు. 1997లోనే ఈ సంస్థ కార్యకలాపాలు మొదలయ్యాయి. ఈ కేసులో
సీమెన్స్‌కు సంబంధం లేదంటే ఎలా వదిలేస్తారు? సీమెన్స్ ఏజీ మాకు సంబంధం లేదని
రాసిన లేఖను సీఐడీ విడుదల చేయాలి. ఈ ప్రాజెక్టుతో మాకు సంబంధం లేదని వారు
చెప్పారా? సీమెన్స్ ఏపీ బడ్జెట్ కంటే ఆరురెట్లు ఎక్కువ నిధులతో వ్యాపారం
చేస్తోంది. ఇంటర్, డిగ్రీ, బీటెక్ యువతకు శిక్షణ ఇచ్చారు. నేడు తెలుగు యువత
ప్రపంచదేశాల్లో ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. సీమెన్స్ మనదేశంలోని ఆరు
రాష్ట్రాల్లో సేవలందిస్తోంది. సీమెన్స్‌పై కట్టు కథలు అల్లి విష ప్రచారం
చేశారు. నిరుద్యోగ యువత జీవితాల్లో నిప్పులు పోశారు. అబద్ధాలు ప్రచారం చేయడంలో
వైసీపీ నేతలు ఆరితేరారు. కోర్టులకు కూడా అసత్యాలు చెబతున్నారని పయ్యావుల
ధ్వజమెత్తారు.