గత నాలుగున్నరేళ్లుగా అరాచక పాలన చూస్తున్నన్నాం
రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి ప్రశ్నించడానికే వీలులేకుండా పోయింది
రాజమహేంద్రవరం జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును నారా లోకేశ్,
బాలకృష్ణతో కలిసిన పవన్ కళ్యాణ్ ములాఖత్
రాజమహేంద్రవరం : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ , జనసేన కలిసి పోటీ
చేస్తాయని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. గురువారం
రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ అనంతరం ఆయన మీడియాతో
మాట్లాడారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన
కొనసాగుతోంది. అందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమ కేసులు
పెట్టి రిమాండుకు పంపించారు. వారికి సంఘీభావం ప్రకటించడానికి ఇక్కడకు వచ్చాను.
చంద్రబాబుతో గతంలో విభేదించి సెపరేటుగా పోటీ చేశాను. రాజకీయాల్లో జనసేన తరఫున
నుంచి నేను తీసుకున్న నిర్ణయం రాష్ట్రం బాగుండాలని, దేశ సమగ్రత బలంగా
ఉండాలనుకున్నా. జనసేన ఏర్పాటు చేసినప్పుడు కూడా అడ్డగోలుగా రాష్ట్ర విభజన
జరిగిందని చెప్పాను. సగటు మనిషి ఆవేదన గురించి మాట్లాడాను. ఆ రోజు నుంచి నేను
తీసుకున్న నిర్ణయాలు చాలా మందికి ఇబ్బందిగా మారాయని అన్నారు. నేను 2014లో
నరేంద్రమోడీకి మద్దతు తెలిపిన సమయంలో ఆయన సొంత పార్టీ వ్యక్తులే ఆయన ప్రధాని
కాకూడదని అనుకున్నారు. దక్షిణ భారతదేశం నుంచి నేను మోదీ మద్దతు తెలిపాను. ఈ
రోజున నేను నా మనసును ఆవిష్కరిస్తున్నాను. దేశానికి చాలా బలమైన నాయకుడు
కావాలి. మా నాన్నగారి అస్థికలు కాశీలో కలపడానికి వెళ్లినప్పుడు ముంబయిలో
ఉగ్రవాదులు తాజ్ హోటల్‌పై దాడి జరిగింది. అంతకముందు పార్లమెంటుపై దాడి
జరిగింది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీకి మద్దతు తెలినప్పుడు చాలా మంది
వ్యతిరేకించారు. ఆ రోజు నుంచి నరేంద్రమోడీ పిలిస్తే తప్ప నేను వెళ్లలేదని
పవన్ అన్నారు.
2014లో బీజేపీ , టీడీపీతో కలిసి పోటీ చేయడానికి గల కారణం విడిపోయిన
ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగాలని. ఆంధ్రప్రదేశ్‌కు చాలా అనుభవం ఉన్న నాయకుడు
కావాలని భావించా. 2020 విజన్ గురించి మాట్లాడినప్పుడు ఎవరికీ అర్థం కాలేదు.
ఇవాళ లక్షలాది మంది మాదాపూర్ వంటి ఐటీ ప్రాంతాల్లో ఎంతో మంది ఉపాధి
పొందుతున్నారు. ఆయనతో ప్రత్యేక హోదా విషయంలో మాత్రమే విభేదించా. వ్యక్తిగతంగా
ఏనాడూ విభేదించలేదు. రూ.300 కోట్ల స్కామ్ పేరు చెప్పి సీఎంకు ఆ అవినీతి మరక
అంటగడుతున్నారు. గుజరాత్లో ప్రారంభమైన కంపెనీ కాంట్రాక్టు ఇచ్చారు. అది
హార్డ్‌వేర్‌ను సప్లయ్ చేస్తుంది. ఏదైనా తప్పు జరిగితే ఆ సంబంధిత వ్యక్తులను
విచారించాలి. అలాంటిది సైబరాబాద్ వంటి సిటీని నిర్మించిన వ్యక్తిని ఇలాంటి
కేసులో ఇరికించడం బాధాకరం. ఈడీ విచారించాల్సిన ఇలాంటి కేసులను రాష్ట్ర
ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుంది. ఇలా చేయడం రాష్ట్రానికి మంచిది కాదన్నారు.
పోనీ అభియోగాలు మోపిన వ్యక్తి ఏమైనా మహానుభావుడా. ఇతనేమన్నా వాజ్పేయీనా? లాల్
బహదూర్ శాస్త్రినా? ఈడీ కేసులను ఎదుర్కొంటున్నాడు. దేశం విడిచి వెళ్లాలంటే
కోర్టుల అనుమతి తీసుకుంటున్నాడు. రాజ్యాంగ ఉల్లంఘనలు చేసే వ్యక్తి. అందరినీ
భయభ్రాంతులకు గురి చేసే వ్యక్తి. డేటా చౌర్యం జరుగుతోందని వాపోయిన వ్యక్తి
ఇవాళ వాలంటీరు వ్యవస్థను అడ్డం పెట్టుకుని అదే పని చేస్తున్నాడు. అడ్డగోలు
హామీలిచ్చి వేటినీ అమలు చేయలేదు. అడ్డగోలు దోపిడీ మాత్రమే చేస్తున్నారు. మద్యం
విషయంలోనే కోట్లు జేబుల్లోకి వేసుకుంటున్నాడు. రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి
ప్రశ్నించడానికే వీలులేకుండా పోయింది. ఎవరైనా ప్రశ్నిస్తే
తట్టుకోలేకపోతున్నారు. నాలాంటి వ్యక్తులనే ఏపీ సరిహద్దుల్లో ఆపేస్తున్నారు.
అలా ఆపే హక్కు ఎవరికీ లేదు. నమస్కారం పెట్టకూడదు. వాహనంలో నుంచి బయటకు
రాకూడదని అంటున్నారు. వ్యతిరేక ఓటు చీలనివ్వనని 2021లోనే చెప్పాను. దానికే 30
సంవత్సరాలు అధికారంలో ఉంటానని కలగన్న వ్యక్తిలో ఉలికిపాటు మొదలైందన్నారు.