తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా
అమరావతి : టీడీపీ నేతల గృహనిర్బంధాల విషయంలో దాఖలైన పిటిషన్పై హైకోర్టులో
బుధవారం విచారణ జరిగింది. ప్రభుత్వ ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష నేతలను
లక్ష్యంగా చేసుకుందని పేర్కొంటూ వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున న్యాయవాది బాలాజీ వాదనలు వినిపించారు.
గృహనిర్బంధం చట్ట వ్యతిరేకమైన చర్య అని న్యాయవాది హైకోర్టు దృష్టికి
తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని
న్యాయవాది బాలాజీ వాదించారు. అధికార పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వం
అనుమతులిస్తూ ప్రతిపక్ష పార్టీలకు నిరాకరిస్తోందని కోర్టుకు తెలిపారు. దీనిపై
కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరఫు న్యాయవాది రెండు వారాల సమయం కోరారు.
అనంతరం సీఎస్, డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసిన
హైకోర్టు తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.