ఇప్పటికే వారిద్దరి అపాయింట్మెట్ కోరిన ఏపీ సీఎం క్యాంపు ఆఫీస్
ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఖరారు
ఇద్దరినీ కలిసిన తరవాత తిరిగి తాడేపల్లి కి సీఎం జగన్
చంద్రబాబు అరెస్ట్ తర్వాత సీఎం ఢిల్లీ పర్యటనపై ఆసక్తి
వచ్చే వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు
చంద్రబాబు అరెస్టుపై సీఎం జగన్ కీలక సమావేశం
అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వచ్చే వారంలో నిర్వహించనున్నారు.
ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు ప్రకటన చేశారు. అయితే
అసెంబ్లీ సమావేశాల్లో ఏ అంశాలు చర్చకు వస్తాయనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా
మారింది. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత రాజకీయ
పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మంగళవారం ఉదయం లండన్ పర్యటన ముగించుకుని
తాడేపల్లికి చేరుకున్న సీఎం జగన్ రాష్ట్రంలోని తాజా పరిస్థితులు,
శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమయంలో సీఎం క్యాంపు కార్యాలయానికి
వచ్చిన చీఫ్ విప్ ప్రసాదరాజు వచ్చే వారం అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్టుగా
చెప్పారు. బుధవారం సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉందని
తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లనున్న జగన్మోహన్రెడ్డి ప్రధాని మోడీతోపాటు కేంద్ర
హోంమంత్రి అమిత్‌షాతో సమావేశం అవుతారని సమాచారం. చంద్రబాబు అరెస్ట్, జమిలీ
ఎన్నికలకు కేంద్రం కసరత్తు వేళ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రాజకీయ ప్రాధాన్యత
సంతరించుకునే అవకాశం ఉంది. ఇక ఢిల్లీ పర్యటన అనంతరం సీఎం జగన్ కేబినెట్ భేటీ
నిర్వహించనున్నారు. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత
వచ్చే వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే కేంద్రం జమిలి
ఎన్నికలకు సిద్దమైన నేపథ్యంలో ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలు ఉండే అవకాశం
ఉందని, కేబినెట్ భేటీలో సీఎం జగన్ ఈ సంకేతాలు ఇచ్చే చాన్స్ ఉందనే ప్రచారం
సాగుతోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలపై మంగళవారం సీఎం క్యాంపు
కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలు, ఉన్నతాధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా పరిణామాలు, శాంతిభద్రతలపై
సీఎం సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు
జగన్ దిశానిర్దేశం చేశారు. చంద్రబాబును అరెస్టు చేసే క్రమంలో జరిగిన ప్రతి
అంశాన్ని జగన్ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు
కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి,
ఇంటెలిజెన్స్ చీఫ్ సీతా రామాంజనేయులు, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి,
వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు
పాల్గొన్నారు.