అమరావతి : రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో నూటికి నూరుశాతం టీడీపీ అధినేత
చంద్రబాబు ప్రాణాలకు రక్షణ లేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఆందోళన
వ్యక్తం చేశారు. సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా చెబుతున్నది అక్షర
సత్యమన్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ బదిలీ
వార్తలు వస్తున్నాయన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో ఎన్నో సంఘటనలో పబ్లిక్‌గానే
జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో పోలీసుల ఉదాసీ వైఖరి ఎన్నోసార్లు
ప్రత్యక్షంగా చూశామని అనురాధ అన్నారు. అమరావతి పర్యటనలో చంద్రబాబు బస్సుపై
వైసీపీ మూకలు రాళ్ల దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నందిగామ పర్యటనలో
జరిగిన రాళ్ల దాడిలో ఎన్ఎస్జీ కమాండో తలకు గాయమవ్వడం, యర్రగొండపాలెంలో మరో
ఎన్ఎస్జీ కమాండోకు దెబ్బలు తగలడం పోలీసుల ప్రేక్షక పాత్రకు నిదర్శనమన్నారు.
అంగళ్లు వద్ద రాళ్ల దాడి జరిగితే బాధితులపైనే హత్యాయత్నం కేసు నమోదు చేశారని
ఆక్షేపించారు. సేవ్ చంద్రబాబు అనేది మన నినాదం కావాలని అనురాధ పిలుపునిచ్చారు.