దోపిడీకి రాచబాట
అధికారులను బెదిరించి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు
చంద్రబాబుతో పాటు నారాయణ, లోకేశ్లదీ కీలక ‘భూ’మిక
లింగమనేనితో క్విడ్ ప్రో కో
రోడ్డు అలైన్మెంట్లో అవినీతి మెలికలు
ప్రతిగా కరకట్ట నివాసం, లింగమనేని నుంచి భూములు
రూ.2 వేల కోట్ల భూ దోపిడీకి బాబు స్కెచ్
గుంటూరు : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుపై చంద్రబాబు ఆయన కుమారుడు పై మరో కేసు
నమోదైంది. ఏ–1 గా నారా చంద్రబాబు నాయుడు ఏ–6 గా నారాలోకేశ్
ఇన్నర్ రింగ్ రింగ్‌రోడ్డు కేసులో కుంభకోణంపై సీఐడీ సమగ్ర దర్యాప్తు జరిపి
కీలక ఆధారాలు సేకరించింది. ఏ–1 చంద్రబాబు, ఏ–2 నారాయణ, ఏ–3 లింగమనేని రమేశ్,
ఏ–4 లింగమనేని రాజశేఖర్, ఏ–5 అంజినీ కుమార్, ఏ–6గా లోకేశ్‌లపై కేసు నమోదు
చేసింది. ఈ కేసులో క్విడ్ ప్రో కో కింద చంద్రబాబు పొందిన కరకట్ట నివాసం,
నారాయణ కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంకు ఖాతాలను అటాచ్ చేయాలని సీఐడీ
నిర్ణయించింది. ఈ మేరకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు
దర్యాప్తును సీఐడీ వేగవంతం చేసింది. రాజధాని అమరావతిని చంద్రబాబు తన అవినీతికి
అక్షయపాత్రగా మార్చుకున్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తన అవినీతికి సాధనంగా
చేసుకుని యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. అందుకు మరో ఉదాహరణ అమరావతి ఇన్నర్
రింగ్ రోడ్ ప్రాజెక్ట్. కేవలం కాగితాల మీదే ఇన్నర్ రింగ్ రోడ్డు
అలైన్మెంట్లో ఇష్టానుసారంగా మార్పులు చేసి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టడం
చంద్రబాబుకే చెల్లింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఆర్డీఏ చైర్మన్‌గా అప్పటి
సీఎం చంద్రబాబు, వైస్ చైర్మన్‌గా అప్పటి మంత్రి పొంగూరు నారాయణ బరితెగించి
పాల్పడ్డ అవినీతి విస్మయ పరుస్తోంది. అందుకోసం లింగమనేని రమేశ్‌తో క్విడ్
ప్రో కోకు పాల్పడిన ఈ కేసులో చినబాబు లోకేశ్ కూడా ప్రధాన పాత్ర పోషించారు.
చంద్రబాబు బినామీ, సన్నిహితుడు లింగమనేని భూముల మార్కెట్ విలువ రూ.177.50
కోట్ల నుంచి రూ.877.50 కోట్లకు రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130
కోట్లుకు చేరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను ఖరారు చేయడం భారీ
దోపిడీకి నిదర్శనం. ఈ అవినీతి పాపంలో చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌కు
కూడా పిడికెడు వాటా ఇవ్వడం కొసమెరుపు. ఇంతటి భారీ అవినీతికి రాచబాట వేసిన
ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ వెనుక గూడు పుఠాణీ ఇలా సాగింది.
చంద్రబాబు అలైన్‌మెంట్‌కు కన్సల్టెన్సీ ద్వారా రాజముద్ర
సీఆర్డీఏ అధికారులు 94 కిలోమీటర్ల పొడవుతో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు
అలైన్మెంట్ రూపొందించడంపై చంద్రబాబు, నారాయణ మండిపడ్డారు. ఎందుకంటే ఆ
అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డు అమరావతిలోని పెద్దపరిమి,
నిడమర్రు, చిన వడ్లపూడి, పెద వడ్లపూడి మీదుగా వెళ్తుంది. అంటే చంద్రబాబు
కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి చెందిన భూములకు 3
కి.మీ. దూరం నుంచి నిర్మించాల్సి వస్తుంది. దాంతో తమ భూముల విలువ అమాంతం
పెరగదని వారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి ఆదేశాలతో సీఆర్డీఏ
అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేశారు.
చంద్రబాబు, లింగమనేని కుటుంబానికి చెందిన వందలాది ఎకరాలు ఉన్న తాడికొండ,
కంతేరు, కాజలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు
అలైన్‌మెంట్‌ను 3 కి.మీ. దక్షిణానికి జరిపారు. హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని
కుటుంబానికి కంతేరు, కాజలలో ఉన్న భూములను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు
నిర్మించేలా 97.50 కి.మీ. మేర అలైన్‌మెంట్‌ను రూపొందించారు. ఈ విషయాన్ని
గోప్యంగా ఉంచి సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీని
రంగంలోకి తీసుకొచ్చారు.
అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్‌ను అమరావతి మాస్టర్
ప్లాన్‌లో చేర్చారు. అనంతరం ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించారు. కానీ
మాస్టర్ ప్లాన్‌లో పొందుపరిచిన అలైన్‌మెంట్‌కు అనుగుణంగానే ఉండాలని షరతు
విధించారు. అప్పటికే సీఆర్డీఏ అధికారుల ద్వారా తాము ఖరారు చేసిన
అలైన్‌మెంట్‌నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా ఆమోదించేలా చేశారు. తాడికొండ,
కంతేరు, కాజలలో హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని భూములను ఆనుకునే అలైన్‌మెంట్‌ను
ఎస్టీయూపీ ఖరారు చేసింది.
రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లు
ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుతో చంద్రబాబు కుటుంబానికి చెందిన
హెరిటేజ్ ఫుడ్స్, ఆయన బినామీ, సన్నిహితుడైన లింగమనేని రమేశ్ కుటుంబానికి
చెందిన భూముల విలువ భారీగా పెరిగింది. కంతేరు, కాజలలో లింగమనేని కుటుంబానికి
355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన 13 ఎకరాలకు ఆనుకుని ఇన్నర్ రింగ్
రోడ్డు అలైన్మెంట్ ఖరారు చేశారు. చంద్రబాబు, నారాయణ తమ కుటుంబ సంస్థలు
హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్‌లతోపాటు తమ బినామీ లింగమనేని రమేశ్ తన
సంస్థల పేరిట ఇన్నర్ రింగ్ రోడ్డుకు అటూ ఇటూ భారీగా భూములు కొన్నారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారుకు ముందు లింగమనేని కుటుంబం ఆ
ప్రాంతంలో ఎకరా భూమి రూ.8 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది.
మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.50 లక్షలు ఉండేది. అంటే ఆ భూముల మార్కెట్ విలువ
రూ.177.50 కోట్లుగా ఉండేది. కాగా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ తర్వాత
ఎకరా రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. అంటే రిజిస్టర్
విలువే నాలుగున్నర రెట్లు పెరిగింది. కాగా మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50
కోట్లు పలికింది. అంటే 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతం రూ.887.50
కోట్లకు పెరిగినట్టే. ఇక రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయితే ఎకరా విలువ
సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో రూ.4 కోట్లకు చేరుతుందని ముఖ్యమంత్రి హోదాలో
చంద్రబాబు అప్పట్లోనే ప్రకటించారు.
ఇక ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు
చేరుతుందని అంచనా వేశారు. అంటే అమరావతి నిర్మాణం పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ
ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. మార్కెట్ ధర ప్రకారం హెరిటేజ్
ఫుడ్స్ 9 ఎకరాల విలువ రూ.4.50 కోట్ల నుంచి రూ.22.50 కోట్లకు పెరిగింది.
అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే అది రూ.54 కోట్లకు చేరుతుందని లెక్క
తేలింది. హెరిటేజ్ ఫుడ్స్ ఒప్పందం చేసుకున్న మరో 4 ఎకరాల విలువ కూడా రూ.24
కోట్లకు చేరుతుంది.
కృష్ణా నదికి ఇవతలా అవినీతి మెలికలే
కృష్ణానదికి ఇవతల విజయవాడ శివారులో నారాయణ తమ ఆస్తుల విలువ భారీగా
పెంచుకున్నారు. సీఆర్డీఏ అధికారులు మొదట రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం
ఇన్నర్ రింగ్ రోడ్డును గుంటూరు జిల్లాలోని అమరావతి నుంచి కృష్ణా జిల్లాలోని
నున్న మీదుగా నిర్మించాల్సి ఉంటుంది. అందుకోసం కృష్ణా నదిపై వంతెన
నిర్మిస్తారు. గుంటూరు జిల్లాలోని నూతక్కి–కృష్ణా జిల్లా పెద్దపులిపర్రు మధ్య
కృష్ణా నదిపై వంతెన నిర్మించి అక్కడ నుంచి తాడిగడప–ఎనికేపాడు మీదుగా నున్న
వరకు ఇన్నర్ రింగ్‌రోడ్డు కొనసాగుతుంది.
అయితే అలా నిర్మిస్తే ఆ ప్రాంతంలోని నారాయణ విద్యా సంస్థల భవనాలను భూసేకరణ
కింద తొలగించాల్సి వస్తుంది. దీంతో ఈ అలైన్‌మెంట్‌పై నారాయణ సీఆర్డీఏ
అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సీఆర్డీఏ సమావేశంలో
అధికారులను పరుష పదజాలంతో దూషిస్తూ అలైన్‌మెంట్‌ను మార్చాలని ఆదేశించారు.
దాంతో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను 3 కి.మీ. తూర్పు దిశగా మార్చారు.
ఆ ప్రకారం గుంటూరు జిల్లాలో రామచంద్రాపురం–కృష్ణా జిల్లా చోడవరం మధ్య వంతెన
నిర్మిస్తారు. అక్కడి నుంచి పెనమలూరు మీదుగా నిడమానూరు నుంచి నున్న వరకు
ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మిస్తారు. దాంతో నారాయణ కుటుంబానికి చెందిన 9
విద్యా సంస్థల భవనాలను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను ఖరారు
చేశారు.