ఎన్ని అక్రమాలు చేసినా సమర్థిస్తావా పవన్?
ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు
గుంటూరు, అభి మీడియా సొల్యూషన్స్ ప్రతినిధి : ఒక పొలిటీషియన్ అరెస్ట్ కావడం,
జైలుకు వెళ్లడం బాధాకరమే. అయితే ఆ పొలిటీషియన్ ఎలాంటి వ్యక్తి, రాజకీయ జీవితం
ఏంటి? అనేది కూడా చూడాలని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
చంద్రబాబు అవినీతి గురించి రాష్ట్రంలో ప్రతీఒక్కరికీ తెలుసని, ఆధారాల్లేకుండా
కోర్టులు తీర్పులు ఇవ్వవనే విషయం గుర్తించాలని చంద్రబాబు అరెస్ట్‌ను ‘కక్ష
రాజకీయం’గా విమర్శలు చేస్తున్నవారికి అంబటి హితవు పలికారు. సోమవారం
తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇన్ని
అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డప్పటికీ వ్యవస్థల్ని మేనేజ్ చేసి
బోనెక్కకుండా వస్తున్నారని, కానీ, రాష్ట్ర ప్రజల అదృష్టమో, ఆయన దురదృష్టమో
ఇప్పుడు అరెస్టయ్యారని అన్నారు.
ఓటుకు నోటు కేసులో వ్యవస్థల్ని మేనేజ్ చేసే తప్పించుకున్నారు. డబ్బుతో ఏదైనా
మేనేజ్ చేయొచ్చన్నది చంద్రబాబు ఆలోచన. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో రేవంత్
రెడ్డికి డబ్బు ఇస్తూ దొరికినా అరెస్టు కాలేదు. వ్యవస్థలను మేనేజ్ చేసి బయట
పడ్డారు. కానీ, రోజులు మారాయి. ఎంతపెద్ద నేరగాడైనా ఎక్కడో చోట దొరికాల్సిందే,
చంద్రబాబు కూడా అలాగే ఇప్పుడు దొరికారు. స్కిల్ స్కామే కాదు. ఇంకా చాలా
ఉన్నాయి. ఫైబర్ నెట్, అసైన్డ్ భూములు, అమరావతి ఇలా చాలా కుంభకోణాలు
ఉన్నాయి. అనర్హుడు, ఇంగితజ్ఞానం లేని వ్యక్తి పవన్ కల్యాణ్. పవన్ కల్యాణ్‌కు
ఇంగిత జ్ఞానం లేదు. ఎన్ని అక్రమాలు చేసినా పవన్ చంద్రబాబును
సమర్థిస్తున్నారు. మేము ప్యాకేజీ అని చెబుతున్నది నిజం కాదా అన్నది పవన్
ఇప్పుడు చెప్పాలి. ముద్రగడని, ఆయన కుటుంబ సభ్యులను కొట్టి అరెస్టు చేసినప్పుడు
పవన్ ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు.
రెండు రోజులు రాష్ట్రంలో ఉత్కంఠత నెలకొంది. అరెస్ట్ అయినప్పటి నుంచి రాజకీయ
డ్రామాలాడారు. కుట్రలకు తెరలేపారు. చంద్రబాబును అరెస్టు చేశాక హెలికాప్టర్ లో
తీసుకెళ్ళాలని సీఐడీ అడిగితే వద్దన్నారు. రోడ్డు మార్గంలో చంద్రబాబును
తీసుకుని వస్తుంటే జనం ఎవరూ పట్టించుకోలేదు. చివరికి చంద్రబాబు కూడా నిరాశ
పడ్డారు. చంద్రబాబుకు నేరాలు కొత్తకాదు. కానీ, ఆయన చేసిన స్కామ్‌లను
గుర్తించడమే ఇప్పుడు కొత్త. ఎన్నికలకు ముందు చంద్రబాబును అరెస్ట్
చేయించాల్సిన అవసరం మాకేంటి?. చంద్రబాబు అరెస్టు వెనుక కక్షసాధింపు లేదు.
ఆయన్ను జైలుకు పంపి ఆనంద పడాల్సిన అవసరం ఎవరికీ లేదు. బాబు హయాంలో అనేక
స్కామ్‌లు జరిగాయి. చాలా కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారు. చంద్రబాబు
అరెస్ట్.. రిమాండ్.. కక్ష పూరిత చర్య అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
కోర్టు రిమాండ్ మీద బంద్‌కు పిలుపు ఇచ్చారా? అని టీడీపీ, జనసేనలను
ఉద్దేశించి ప్రశ్నించారాయన.
చంద్రబాబు విజయవాడ రాకముందే ఢిల్లీ నుండి పెద్దపెద్ద లాయర్లు వచ్చారు.
చంద్రబాబు స్కాం చేయలేదని వారు వాదించలేదు. కేవలం టెక్నికల్ అంశాల మీదనే పది
గంటలసేపు వాదించారు. చివరకు చంద్రబాబు కూడా తన వాదనలను వినిపించుకున్నారు. ఆయన
కూడా నేను స్కాం చేయలేదు అని కాకుండా టెక్నికల్ అంశాలనే ప్రస్తావించారు. .
అసలు రాష్ట్రంలో ఎన్నికలు అతి ఖరీదు కావటానికి కారణమే చంద్రబాబు. ఎల్లోమీడియా
చంద్రబాబును దేవుడనీ, జగన్‌ని రాక్షసుడనీ చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ
వాస్తవాలు ఏంటో జనానికి అర్థం అయిందికోర్టు రిమాండ్ విధిస్తే బంద్ కి పిలుపు
ఇవ్వటం ఏంటి? చంద్రబాబు అవినీతి పరుడనీ, అతనిపై చర్యలుబతీసుకోవాలని గతంలో
కోరిన పవన్.. ఇప్పుడు ఎందుకు వెనుకేసుకు వస్తున్నారు?. జనాన్ని రెచ్చగొడితే
రెచ్చిపోయే పరిస్థితిలో జనంలేరు. చంద్రబాబు మ్యానిప్లేటర్, డబ్బుతో ఏదైనా
మేనేజ్ చేస్తారు. కానీ ఆ పరిస్థితులు ఇక చెల్లవు. ఆయన అండ చూసుకునే రామోజీరావు
కూడా అక్రమాలు చేశారు. చట్టపు రధ చక్రాల కింద తప్పు చేసినవారు ఎవరైనా
నలిగిపోవాల్సిందేనని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.