దర్యాప్తు సంస్థలకు సహకరించాలి
జ్యూడిషియరీ ముందు అంతా ఒక్కటే
ఇక్కడ ఎవ్వరికీ మినహాయింపు లేదు
బాధ్యత గల ప్రజా నాయకులు దానికి సహకరించాలి
ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం : దర్యాప్తు సంస్థలకు సహకరించి మీరు మీ నిర్దోషిత్వాన్ని
నిరూపించుకోవాలి. మీరు దర్యాప్తు సంస్థలను నమ్మడం లేదు..మేం మిమ్మల్ని
నమ్మడం లేదు. మీరు ఈ విధంగా సభ్య సమాజాన్ని రెచ్చగొట్టే చర్యలను
మానుకోవాలి. అమాయక జనాన్ని రెచ్చగొట్టి, లాఅండ్ ఆర్డర్ కు సమస్య తెచ్చే
విధంగా ప్రవర్తించడం తగదు. ప్రజాధనం దుర్వినియోగం అయింది అంటే
తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో మైలేజీ వస్తుందని నేను అనుకోను. అరెస్టుతో
తెలుగుదేశం పార్టీకి మైలేజీ వస్తుందని అనుకుంటే ఏం చేయలేం. వాస్తవాలు
అన్నవి ప్రజలకు తెలియాల్సి ఉంది. అవి తెలిశాక జ్యుడీషియరీ ముందు ఎవరికి
వారు నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. అప్పుడే ఎవరి సచ్ఛీలత ఎంతన్నది
తేటతెల్లం అవుతుందని మంత్రి ధర్మాన అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో
ప్రధాన నిందితుడు నారా చంద్రబాబును అరెస్టు సుహాసిని ఏపీసీఐడీ ఆదివారం ఆయనను
కోర్టులో హాజరుపర్చింది. ఈ సందర్బంగా ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన
ప్రసాదరావు మాట్లాడుతూ బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధిగా చంద్రబాబు దర్యాప్తు
సంస్థలకు సహకరించాలని అన్నారు. చంద్రబాబు అరెస్టుపై మంత్రి ధర్మాన ప్రసాదరావు
ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
అరెస్టే చేయకూడదు అని వాదిస్తే ఎట్లా ? : ఇదేదో నిన్న అనుకుని ఈరోజు
చేసియాన్ అరెస్టు కాదు. ఈ కేసులో రెండేళ్ల కిందటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్
అయ్యింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యాక కొన్ని పేర్లు వస్తాయి. దర్యాప్తు
చేస్తున్నప్పుడు ఇంకొన్ని పేర్లు కూడా వీటికి అదనంగా వచ్చి కలుస్తాయి. ఈ
కేసులో 37వ ముద్దాయిగా చంద్రబాబు నాయుడు పేరును చేర్చి, కోర్టు ముందు
హాజరుపరిచారు. అసలు చంద్రబాబు నాయుడును అరెస్టే చేయకూడదు అని ఎవ్వరైనా
వాదిస్తే అది ఎంత మాత్రం సబబు కాదు. రాజకీయ పార్టీలకు చెందిన వారు కానీ
పౌరులు కానీ అరెస్టే చేయకూడదు అని వాదిస్తే ఎట్లా ? మన వ్యవస్థలో,మన
రాజ్యాంగ వ్యవస్థలో ఎవరికైనా మినహాయింపు ఉంటుందా? తప్పనిసరిగా అందరూ
చట్టం ముందు జవాబు చెప్పాల్సి ఉంటుంది. అందుకే దర్యాప్తు సంస్థ అరెస్టు
చేస్తుందే తప్ప అరెస్టుకు సంబంధించి కారణాలను ముద్దాయితో సహా కోర్టు ముందు
ఉంచుతుంది. అరెస్టు సక్రమమా ? అక్రమమా ? అన్నది కోర్టు నిర్ణయిస్తుంది.
ఎవరికైనా ఈ దేశంలో ఇదే పద్ధతి. వ్యవస్థకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు
వ్యవస్థ నడుచుకుందని చెప్పడానికి ఏమీ లేదు కదా అన్నారు.
ఏ ఒక్కరికో ఎందుకు మినహాయింపు ఇవ్వాలి ? : ఇతను ఇంతకుముందు ప్రభుత్వాన్ని
నడిపారు. ఆ సందర్భంలో ఆ ప్రభుత్వంలో భారీగా ధనం దుర్వినియోగం అయిందని
రకరకాల సంస్థల నుంచి ఎస్టాబ్లిష్ అయింది. ఇతని పేరును ఛార్జిషీట్ లో 37వ
ముద్దాయిగా చేర్చి కోర్టు ముందు హాజరు పరిచారు. దానిని మనం తప్పు
పట్టేందుకు వీల్లేదని సభ్య సమాజానికి విన్నవిస్తున్నాను. దేశంలో ఇదేమైనా
కొత్తా.. ఈయన ఒక్కరిపైనా ఇలా వ్యవహరించిందా వ్యవస్థా ? మాజీ ప్రధాని
ఇందిరా గాంధీ కోర్టు ముందు నిలబడలేదా? మన రాష్ట్రానికి చెందిన పీవీ
నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఎదుర్కొన్న ఆరోపణలకు సంబంధించి
కోర్టు ముందు నిలబడలేదా? పక్కనే ఉన్న తమిళనాడుకు చెందిన జయలలిత
కోర్టు ముందు నిలబడలేదా? మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలబడలేదా
కోర్టు ముందు? పోనీ మేం అంతా నిలబడలేదా కోర్టు ముందు? ఎందుకు ఆయనకు
ఒక్కరికే మినహాయింపు అవుతుంది? ఇందులో తెలిసీ,తెలియక ఆందోళన చేయాల్సిన
అవసరం ఏముంది? దయచేసి అది కాదు మాట్లాడాల్సింది. మళ్లీ మాకు ఈ రాష్ట్రంలో
అధికారం ఇవ్వండి అని అడిగినటువంటి వ్యక్తి.. తాము అధికారం ఇచ్చినప్పుడు
ఇంతటి భారీ తప్పిదానికి పాల్పడ్డారు. అసలు ఇందులో వాస్తవాలు ఏమిటనేది ప్రజలు
తెలియజేసేందుకు దర్యాప్తు సంస్థలకు అవకాశం ఇవ్వాలన్నారు.
అభియోగాలన్నవి తప్పు అని నిరూపించండి చాలు : గతంలో ఇలాంటి ప్రభుత్వాలను
నడిపినటువంటి వ్యక్తులు కూడా అమాయక ప్రజలను రెచ్చగొట్టి,వారిని
ఉసిగొల్పి,దర్యాప్తు సాగనివ్వకుండా చేయడం,దర్యాప్తు అనేది ఓ మోటివ్ తో
జరుగుతుందని అంటూ తప్పు దారి పట్టించడం ఇది కరెక్టు కాదన్నది నా
అభిప్రాయం. మీకు నిజంగా దర్యాప్తులో పెట్టినటువంటి అంశాలు రుజువు
చేసుకునేందుకు అవకాశం ఉంది. రుజువు చేసుకునే క్రమంలో కోర్టు పరిధిలో నమోదు
అయిన అభియోగాలన్నవి తప్పు అని నిరూపించుకుంటే తప్పకుండా మీరు నిర్దోషిగా
బయటపడతారు. ప్రజాధనం దుర్వినియోగం గురించి దర్యాప్తు సంస్థలు
చెబుతున్నాయి. ప్రజా జీవితంలో ఉండే ఇలాంటి వారు దర్యాప్తుకు సహకరించేందుకు
స్వచ్ఛందంగా ముందుకు రావాలి. తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు. అసలు
తప్పించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాన్నే సమాజం తప్పుపట్టాలని భావించే
వ్యక్తిని నేను. మీరు ఏదో విధంగా తప్పించుకోవాలని చూడడం కరెక్టు కాదు.
మనం ప్రమాణం చేసి వస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రజా ధనాన్ని దుర్వినియోగం
చేయమని. దుర్వినియోగం జరిగిందని దర్యాప్తు సంస్థలు స్పష్టంగా
చెబుతున్నాయన్నారు.